'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్
on Feb 21, 2022

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా ఈరోజు జరగాల్సిన 'భీమ్లా నాయక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' ఈ నెల 25 న థియేటర్స్ లో సందడి చేయనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21న(సోమవారం) నిర్వహించాలని ప్లాన్ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్న ఈ ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. అయితే ఈ ఉదయం ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఇలాంటి సమయంలో ఈ వేడుక నిర్వహించడం సరి కాదని భావించిన మూవీ టీమ్.. ప్రీరిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకుంది.

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి సంతాపంగా 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. గౌతమ్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సితార సంస్థ.. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
ఈ విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి తన మనసు అంగీకరించడం లేదని, అందుకే 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేశామని తెలుపుతూ పవన్ కళ్యాణ్ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు.

'భీమ్లా నాయక్'లో పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



