అక్కడ కూడా టెంపర్ లేపుతున్నాడు!
on Aug 12, 2017
‘బాహుబలి’తర్వాత బాలీవుడ్ నిర్మాతల దృష్టంతా తెలుగు సినిమాపైనే పడినట్టుందండోయ్. ఏ తెలుగు సినిమాను రీమేక్ చేద్దామా? ఏ తెలుగు సినిమాను డబ్ చేసి విడుదల చేద్దామా? అని తెగ ఉబలాట పడిపోతున్నారు. ఇంతకీ ఏమైందీ? అనుకుంటున్నారా!. విషయం ఏంటంటే... బాలీవుడ్లో మరో తెలుగు సూపర్ హిట్ కథ తెరకెక్కనుంది. ఆ సూపర్ హిట్ ఏంటో చెప్పనేలేదు కదూ..! పూరి జగన్నాథ్ ‘టెంపర్’. ఎన్టీయార్ హీరోగా రూపొందిన ఈ చిత్రం... ఎంత విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా హక్కులని సచిన్ జోషి సొంతం చేసుకున్నాడు. ఈ ముంబయ్ కుర్రాడు... కొన్ని తెలుగు చిత్రాల్లో హీరోగా కూడా నటించాడు. ఇప్పుడు తానే నిర్మాతగా ఈ చిత్రం నిర్మించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇంతకీ ఇందులో హీరోగా నటించేదెవరు? దర్శకత్వం ఎవరు చేస్తారు? అనే వివరాల్లోకెళ్తే... ఇందులో హీరో కేరక్టర్ కోసం సచిన్ జోషి.. ఇప్పటికే ఇద్దరు హీరోలకు కలిశాడు. వారే అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్. చివరకు రణవీర్ ఖరారైయ్యాడు. రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా సమాచారం తెలియాల్సివుంది.
ఏది ఏమైనా... హిందీ సినిమాలు పరాజయాల బాట పట్టడం, దక్షిణాది కథలే చివరకు వారికి దిక్కవడం.. ఇదంతా చూస్తుంటే ‘భూమి గుడ్రంగా ఉంటుంది’అనే విషయం గుర్తొస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్?