భైరవ గీత మూవీ రివ్యూ
on Dec 14, 2018
నటీనటులు: ధనుంజయ్, ఇర్రా మోర్, రాజా బల్వాడి, విజయ్ రామ్ తదితరులు
నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్
కెమెరా: జగదీశ్ చీకటి
మాటలు: రామ్ వంశీకృష్ణ
సంగీతం: రవిశంకర్
రచన, స్క్రీన్ ప్లే, సమర్పణ: రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు: అభిషేక్ నామా, భాస్కర్ రాశి
దర్శకత్వం: సిద్ధార్థ్ తాతోలు
విడుదల తేదీ: డిసెంబర్ 14, 2018
కర్ణాటకలో ఓ వారం క్రితమే (డిసెంబర్ 7న) 'భైరవ గీత' విడుదలైంది. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు సెన్సార్ సమస్యలు కావొచ్చు... థియేటర్ల సమస్య కావొచ్చు... కారణాలు ఏవైనా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆలస్యంగా వచ్చిందీ సినిమా. కన్నడలో 'భైరవ గీత' భారీ విజయం సాధించిందన్న మాటలు ఎక్కడా వినపడలేదు. అలాగే, అక్కడ సినిమా విడుదలైన తరవాత తెలుగులో సినిమా యూనిట్ సభ్యులు ఎవరూ పబ్లిసిటీ చేయలేదు. వర్మ ట్వీట్లు మాత్రమే చేస్తున్నారు. మంచి సినిమాలకు పబ్లిసిటీ అవసరం లేదు. ప్రేక్షకులే సినిమా చూడమని నలుగురికి చెబుతారు. ఈ సినిమా నలుగురికీ చూడమని చెప్పేలా వుందా? లేదా? రివ్యూ చదివి తెలుసుకోండి.
కథ:
సుబ్బారెడ్డి (రాజా బల్వాడి) రాయలసీమలో ఓ గ్రామానికి పెద్ద. మనుషుల కంటే కులానికి ఎక్కువ విలువ ఇచ్చే వ్యక్తి. అట్టడుగు కులాల వారిని హీనంగా చూస్తాడు. అతని దగ్గర భైరవ (ధనుంజయ్) పని చేస్తుంటాడు. తమ ఇంట్లో పనోడు భైరవను ప్రేమిస్తుంది సుబ్బారెడ్డి కుమార్తె గీత (ఇర్రా మోర్). కుమార్తె ప్రేమ విషయం తండ్రికి తెలుస్తుంది. భైరవను చంపాలని ప్లాన్ చేస్తాడు. తండ్రి క్రూరత్వాన్ని తెలుసుకున్న గీత... భైరవతో కలసి లేచిపోతుంది. ఊరి నుంచి ఇద్దరూ పారిపోతారు. రెడ్డి కులస్థులు అందరూ ఈ ప్రేమను జీర్ణించుకోలేక.. ప్రేమ జంటను చంపాలని బయలుదేరతారు. చినికి చినికి గాలి వాన అయినట్టు ఈ ప్రేమ పోరు కాస్తా.. అట్టడుగు వర్గాల (కులాల) వారికీ, ఉన్నత వర్గాల వారికీ యుద్ధంగా మారుతుంది. ఈ యుద్ధంలో భైరవ ఎలా విజయం సాధించాడు? అనేది సినిమా.
విశ్లేషణ:
కోటలోని రాణి తోటమాలి ప్రేమలో పడితే... ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే సినిమా కథ. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతోమంది ఈ కథతో సినిమాలు తీశారు. దీనికి వర్మ రాయలసీమ నేపథ్యాన్ని, కుల కక్షలను జోడించాడు. ఓ రకంగా మంచి కథను రాశాడు. కానీ.. స్క్రీన్ ప్లే, లవ్ ట్రాక్ సరిగా రాలేదు. కథేంటో మొదట్లో ప్రేక్షకులకు తెలుస్తుంది. దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఈ కథను ఎలా చెప్పకూడదో ఇతరులకు చెప్పడానికి అన్నట్టు సినిమా తీశాడు. ఇదే కథ మరో దర్శకుడి చేతిలో పడితే... తెరపైకి అద్భుతంగా వచ్చేదేమో? వర్మ ఏరి కోరి తన శిష్యుడు సిద్దార్థ్ చేతిలో పెట్టాడు. అతడిపై వర్మ ప్రభావం ఏస్థాయిలో వుందో... సినిమా మొదలైన కాసేపటికి తెలుస్తుంది. దర్శకత్వంలోని ప్రతి అంశంలో సిద్ధార్థ్ బదులు వర్మ ఎక్కువ కనిపిస్తాడు. ముఖ్యంగా కెమెరా యాంగిల్స్ లో. టెక్నికల్ గా వర్మను ఫాలో అయ్యాడు, బాగానే సక్సెస్ అయ్యాడు గానీ... వర్మలా నటీనటుల నుంచి సన్నివేశాలను తగ్గట్టు నటనను రాబట్టుకోవడంలో సక్సెస్ కాలేదు. వర్మ కథకు సిద్దార్థ్ న్యాయం చేయలేదు గానీ... సినిమాటోగ్రాఫర్ చేశాడు. రాయలసీమ ప్రాంతంలో అందమైన ప్రదేశాలను అంతే అందంగా కెమెరాలో బంధించాడు. మ్యూజిక్ అంతంత మాత్రమే. పాటల్లో గుర్తుపెట్టుకునేవి లేవు. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో బావుంది.
ప్లస్ పాయింట్స్:
రాయలసీమ అందాలు (లొకేషన్స్)
కథ, సినిమాటోగ్రఫీ
రాయలసీమ యాసలో సాగిన కొన్ని సంభాషణలు
మైనస్ పాయింట్స్:
హీరో హీరోయిన్లు
లవ్ ట్రాక్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం
ఎడిటింగ్, మ్యూజిక్ వగైరా వగైరా
నటీనటుల పనితీరు:
సినిమా ప్రారంభంలో హీరోయిన్ ఇంట్లో పనివాడిగా కనిపించిన హీరో... యజమానిపై ఎదురు తిరిగే సమయంలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావాలి. ధనుంజయ్‌కి తెలుగులో స్టార్‌డమ్ లేకపోవడం వల్ల హీరోయిజమ్ చూపించే సన్నివేశాలు అంతగా పండలేదు. నటుడిగా అతడు మెరిసిందీ తక్కువ. ఒక్కటి రెండు ఎక్స్‌ప్రెషన్స్‌తోతో సినిమా అంతా నటించాడు. 'రౌడీ' సినిమాలో మంచు విష్ణు, శాన్వి మధ్య వర్మ తీసిన పాట కంటే ఘాటుగా శిష్యుడు సిద్ధార్థ్ ఈ సినిమాలో ఓ పాట చిత్రీకరించారు. ఇర్రా మోర్ అందులో రెచ్చిపోయి మరీ అందాలను ఆరబోసింది. అందాల ప్రదర్శన వరకూ పర్లేదు కానీ.. నటనలో మాత్రం ఆమె శూన్యం. మిగతా నటీనటులు ఓవర్ యాక్టింగ్ చేశారు.
చివరగా: వర్మ అభిమానులను ఈ సినిమా ఆకట్టుకోవచ్చు. సగటు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు మాత్రం సినిమాలో చాలా అంటే చాలా తక్కువ వున్నాయి.
రేటింగ్: 1.75/5