'బంగార్రాజు' దూకుడు.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
on Jan 16, 2022
అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య నటించిన సినిమా 'బంగార్రాజు'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైన బంగార్రాజు సినిమా మొదటి రెండు రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టింది.
సంక్రాంతికి విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వాయిదా పడటం బంగార్రాజుకి కలిసి వచ్చింది. రౌడీ బాయ్స్, హీరో వంటి సినిమాలు కూడా ఈ సంక్రాంతి విడుదల అయినప్పటికీ.. అక్కినేని హీరోలు నటించిన సినిమా కావడంతో పాటు, నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకి సీక్వెల్ కావడంతో బంగార్రాజుపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందుకుతగ్గట్లే మొదటి రెండురోజులు బంగార్రాజుకి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.9.06 కోట్లు కలెక్ట్ చేసిన బంగార్రాజు రెండో రోజు రూ.7.79 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి రెండురోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బంగార్రాజుకి వచ్చిన షేర్ రూ.16.85 కోట్లు కాగా, గ్రాస్ 27 కోట్లకు పైగా వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా బంగార్రాజు రెండు రోజులకు గాను రూ.18.85 షేర్, రూ.31.2 కోట్ల గ్రాస్ రాబట్టింది.
బంగార్రాజు రూ.38.15 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. రూ.39 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ గా నిలవనుంది. ఇంకా హిట్ కి 20 కోట్ల దూరంలో ఉన్న బంగార్రాజు.. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుండటం, మరోవైపు 18 నుంచి ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ తో పాటు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడవనున్న నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో బంగార్రాజు వీలైనంత ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టాల్సింది ఉంది.
Also Read