షాకింగ్.. మూడోసారి కరోనా బారిన పడిన బండ్ల గణేష్!
on Jan 10, 2022

సినీ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు, సత్యరాజ్, త్రిష, మంచు లక్ష్మి, మీనా వంటి వారు కరోనా బారిన పడగా.. తాజాగా ఆ లిస్ట్ లో బండ్ల గణేష్ కూడా చేరిపోయారు. అయితే ఆయన కరోనా బారిన పడటం ఇది మూడోసారి కావడం గమనార్హం.
బండ్ల గణేష్ ప్రతి వేవ్ లోనూ కరోనా బారిన పడుతున్నారు. ఫస్ట్ వేవ్ లో కరోనా బారిన పడిన ఆయన.. సెకండ్ వేవ్ లోనూ కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారి.. ఐసీయూలో చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే కొద్దిరోజులుగా కరోనా మళ్ళీ విజృంభిస్తుండగా.. ఆయన మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తాజాగా ప్రకటించారు.

"గత మూడు రోజులు నేను ఢిల్లీలో ఉన్నాను. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా ఆదివారం సాయంత్రం కరోనా పాజిటివ్ అని తేలింది. నా కుటుంబ సభ్యులకు నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేముందు ఒక్కసారి ఆలోచించుకోండి" అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
బండ్ల గణేష్ మూడో సారి కరోనా బారిన పడటం సంచలనంగా మారింది. ఇటీవల మాజీ కేంద్రమంత్రి,టీఎంసీ నేత బాబుల్ సుప్రియో సైతం మూడోసారి కరోనా బారినపడ్డారు. దీంతో కరోనా ఎన్నిసార్లైనా సోకే ప్రమాదముందని, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



