ప్రభాస్ ఫ్యాన్స్ ఆ సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందేనా?
on May 20, 2024
త్వరలో 'కల్కి 2898 AD'తో ప్రేక్షకులను పలకరించనున్న ప్రభాస్ (Prabhas) చేతిలో.. 'రాజా సాబ్', 'సలార్-2', 'స్పిరిట్'తో పాటు 'హను రాఘవపూడి ప్రాజెక్ట్' వంటి భారీ సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో 'సలార్-2' (Salaar 2) మూవీ.. అసలు ఉంటుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన 'సలార్'.. గతేడాది డిసెంబర్ లో విడుదలై, వరల్డ్ వైడ్ గా రూ.700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. దీనికి కొసాగింపుగా పార్ట్-2 ఉంటుందని ముందుగానే ప్రకటించారు. మే చివరిలో షూటింగ్ మొదలు కానుందని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా వచ్చిన ఓ అప్డేట్.. 'సలార్ 2'పై డౌట్స్ క్రియేట్ చేస్తోంది.
ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ మూవీని జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా (NTRNeel) నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు కానుందని ప్రకటించారు. అంటే షూటింగ్ కి వెళ్ళడానికి ఇంకా రెండు నెలలే సమయముంది. ఈ లెక్కన ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేంగా జరుగుతుందని అర్థమవుతోంది.
రెండు నెలల్లో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ షూటింగ్ పెట్టుకొని.. ప్రశాంత్ నీల్ ఇప్పుడు 'సలార్ 2' ని మొదలు పెట్టడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి భారీ ప్రాజెక్ట్ లకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా కీలకం. పైగా ఎక్కువ సమయం కూడా పడుతుంది. మరోవైపు ప్రభాస్ కూడా ప్రస్తుతం 'సలార్ 2' షూటింగ్ కి అందుబాటులో ఉండటం కష్టమే. జూన్ 27న 'కల్కి 2898 AD' విడుదల కానుంది. పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయాలని చూస్తున్న కల్కి ప్రమోషన్స్ కోసం.. ప్రభాస్ కనీసం నెల రోజులైనా కేటాయించే అవకాశముంది. ఇలా ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. 'సలార్ 2' స్టార్ట్ కావడం కష్టమే అనిపిస్తోంది. ఎన్టీఆర్ ప్రాజెక్ట్, 'సలార్ 2' రెండూ భారీ సినిమాలే కావడంతో.. పారలల్ గా షూటింగ్ చేసే అవకాశాలు ఉండవనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక స్టార్ట్ కావాలి లేదంటే ఇక 'సలార్ 2'పై ఆశలు వదులుకోవాల్సిందే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.