ENGLISH | TELUGU  

అర్జున్‌రెడ్డి మూవీ రివ్యూ

on Aug 25, 2017

తారాగణం:  విజయ్ దేవరకొండ, షాలినీపాండే, శివ...
నిర్మాత, దర్శకత్వం:  సందీప్ రెడ్డి వంగా

ప్రేమ అంటే... ఓ పవిత్రత. అదో దైవత్వం.  బంధాన్ని బట్టి దాని వ్యక్తీకరణ ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ప్రేమ వ్యక్తీకరణ పలు విధాలుగా ఉన్నా...   sex an altimete Expresstion Of love. అదో బలీయమైన సందర్భం. రెండు శరీరాలు, రెండు ఆత్మలు మమేకమయ్యే అద్భుత సంఘటన. ఈ ప్రకృతికే అదొక మూలాధారం. అంతే తప్ప అది బలహీనత ఎంతమాత్రం కాదు. ‘సెక్స్’ పట్ల జరనరేషన్లో వస్తున్న మార్పులు.. భావితరాల అభ్యున్నతికి వినాశ హేతువు.  ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. జనరేషన్లో మార్పు సహజం. కానీ... ప్రేమలో మార్పుండదు. మారితే అది ప్రేమకాదు. ప్రేమ ఎప్పుడూ పరిధి దాటి ప్రవర్తించదు. అలా ప్రవర్తించేది ‘కామం’ మాత్రమే.  


ఇక ప్రపంచాన్నే ప్రభావితం చేయగల బలీయమైన సాథకం సినిమా . అందుకే... నైతిక విలువలకు తిలోదకాలిచ్చి సినిమా తీయకూడదు. అలా తీస్తే... అదే నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అప్పుడు అనైతికత రాజ్యమేలుతుంది. ఇది బాధ్యతగల దర్శక, నిర్మాతలు గ్రహించాల్సిన విషయం. ‘మేం బయట జరిగేదే చూపిస్తున్నాం... ’ అనే మాట కూడా ఈ మధ్య దర్శకుల్లో వినిపిస్తోంది. బయట ఎక్కడో ఏదో జరగితే... దాన్ని వెండితెర ఎక్కించి, కోట్లాదిమందికి చూపించి, మంచి వాళ్లను సైతం ఎడ్యూకేట్ చేసి చెడగొట్టడం మంచి పద్ధతి కాదు. బాధ్యతగల పౌరులు చేయదగిన పని అంతకన్నా కాదు. రాత్రి ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన తర్వాత ఈ విషయాలు చెప్పాలనిపించింది. ఇక ‘అర్జున్ రెడ్డి’ కథలోకెళ్దాం.

కథ:-
అర్జున్ రెడ్డి... యూనివర్సిటీలోనే బ్రిలియంట్ మెడికో. స్వతంత్రభావాలున్న కుర్రాడు. ముక్కుసూటి మనిషి. ముక్కుమీద కోపం. దీనికి తోడు ఆలోచన తక్కువ, వేగం ఎక్కువ. అలాంటి కుర్రాడికి ప్రీతి కనిపిస్తుంది. తను అర్జున్ రెడ్డికి జూనియర్. అయినా.. సరే పిచ్చిగా ప్రేమించేస్తాడు. ప్రీతి కూడా అర్జున్ రెడ్డిని ఇష్టపడుతుంది. అయితే... ప్రీతి వాళ్ల నాన్న మాత్రం పెళ్లికి ఒప్పుకోడు. పైగా అర్జున్ రెడ్డిని అవమానిస్తాడు. దాంతో స్వతహాగా ఉన్న ఉద్రేకాన్ని ఆపుకోడానికి డ్రగ్స్ తీసుకుని... తన జీవితంలో విలువైన రెండు రోజుల్ని పోగొట్టుకుంటాడు అర్జున్ రెడ్డి. ఆ రెండు రోజుల్లోనే ప్రీతి పెళ్లి కూడా అయిపోతుంది. నిజం తెలుసుకుని అర్జున్ గుండె బద్ధలవుతుంది. ప్రీతి ఇంటికెళ్లి ప్రాధేయపడ్డా ప్రయోజనం ఉండదు. కొట్టి అవమానిస్తారు. దాంతో అర్జున్ మందుకు బానిసవుతాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది మిగిలిన కథ. 

డైరెక్షన్:-
ఇలాంటి కథలు గతంలో చాలా వచ్చాయ్. విఫల ప్రేమకథలన్నీ దాదాపు ఇలాగే ఉంటాయ్. కథనం కొత్తగా ఉంటే సినిమా బావున్నట్టే. అయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా... సినిమాను కొత్తగా కంటే... బోల్డ్ గా తీయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. బయట ప్రపంచంలో జరుగుతున్న గొడవల్లో... అమ్మ బూతులు తిట్టుకుంటారనీ... ఈయనగారు ఏకంగా సినిమాలోనే అమ్మల్ని పచ్చిగా తిట్టించాడు. ఇది నిజంగా క్షమించరాని విషయం. అలా అయితే... బయట ఇంకా చాలా అరాచకాలు జరగుతున్నాయ్. వాటన్నింటినీ తెరెక్కిస్తావా? 


ఇక ముద్దులు... అటుఇటుగా ఈ సినిమాలో ఓ పాతిక లిప్ లాక్ లు ఉన్నయ్. చూపించడమే ఇన్నిసార్లు చూపిస్తే... ఇక లొకేషన్లో కట్ లన్నీ పోను ఎన్నిసార్లు ముద్దులు పెట్టుకొని ఉంటారా? అని అందరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎదురెదురు పడటమే పాపం.. ఇద్దరి మూతులూ అయస్కాంతం, ఇనుపముక్క లాగా అతుక్కుపోతున్నాయ్. మరీ ఇంత అడ్డగోలు తనమా?. ఇక మెడికో స్టూడెంట్లంటే... సెక్స్ విషయం తేలిగ్గా తీసుకుంటారనేది దర్శకుని భావమేమో... పెళ్లి కాకముందే అన్నీ కానిచ్చేసినట్టు చూపించి, భావితరాలకు సందేశాన్ని ఇచ్చేశాడు. అందరూ ఇలాగే ఏడవండి అని. 


ఇక ప్రథమార్థంలో సన్నివేశాలన్నీ నాచురల్గా ఉండటంతో ఎక్కడా విసుగు అనిపించలేదు. కొన్ని సన్నివేశాలు ‘శివ’ సినిమా గుర్తుకుతెస్తే... కొన్ని సీన్స్.. ‘మహర్షి’ ని తలపిస్తాయ్. అయితే... దాదాపు ఫస్టాఫ్ లోనే కథంతా అయిపోతుంది. ఇక ద్వితీయర్థంలో చూపించాల్సింది క్లయిమాక్స్ మాత్రమే. మరి అది వెంటనే వచ్చేస్తే ఎలా? అందుకే... సా....గదీసి, సా... గదీసి ద్వితీయార్థం అంతా జనాల సహనంతో ఆడుకున్నాడు దర్శకుడు. మళ్లీ క్లయిమాక్స్బా బావుంది. అంటే... క్లయిమాక్స్ వచ్చేదాకా ఓర్పుకు పరీక్షే. 

నటీనటుల ప్రతిభ:-
ఈ సినిమాకు ప్రధాన బలం.. నటీనటుల నటన. హీరో దేవరకొండ విజయ్ అసలు ఎక్కడా నటించలేదు. బిహేవ్ చేశాడు. నిజంగా తెలుగు తెరపై కచ్చితంగా అతనో స్టార్ హీరో అవుతాడు. హీరోగా తను ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. ఇక హీరోయిన్ షాలినీపాండేని మూతి ముద్దులతో చాలా ఇబ్బంది పెట్టారు పాపం. కానీ... అన్నీ తట్టుకొని పాత్రకు మాత్రం ప్రాణం పోసింది. అలాగే హీరో ఫ్రెండ్ పాత్ర పోషించిన శివ... దేవరకొండ విజయ్ కి ధీటుగా చేశాడు. ఇలా.. ఇందులో నటించిన వారంతా.. అద్భుతంగా చేశారనే చెప్పాలి. సాంకేతికంగా సినిమా ఓకే. చెప్పుకోదగ్గ పాట మాత్రం ఒక్కటీ లేదు. 

ఇది యువతరం కోసం తీసిన సినిమా అని దర్శకుడు చెబుతున్నాడు. అయితే... ‘యువతరంలో కూడా అందరికీ నచ్చే సినిమా కాదిది’. అనేది చాలామంది అభిప్రాయం. ఏది ఏమైనా... ‘అర్జున్ రెడ్డి’ అందరివాడు కాదు. కొందరివాడే . 

రేటింగ్: 2.5

పంచ్‌లైన్:
అర్జున్‌రెడ్డి అందరివాడు కాదు

 

- ఎన్.బి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.