అనుష్క తన కెరీర్‌నే పణంగా పెట్టిందా?
on Nov 2, 2015
హీరోయిన్లంతా సన్నబడాలి, జీరో సైజ్ తెచ్చుకోవాలని ఆరాటపడతారు. అయితే అనుష్క మాత్రం.. బాగా లావవ్వాలి... బండగా కనిపించాలి అని తాపత్రయపడింది. సైజ్ జీరో సినిమా కోసం. ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అనుష్కని చూసి అంతా నివ్వెరపోతున్నారు. భలే లావైందే అంటూ ఆశ్చర్యపోయారు. దాదాపు ఈ సినిమా కోసం స్వీటీ 22 కిలోలు పెరిగింది. మళ్లీ కొంచెం కొంచెం తగ్గుతోంది. పెరగడానికి అట్టే టైమ్ పట్టలేదు గానీ.. తగ్గడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతోందట.
మరోవైపు బాహుబలి 2 షూటింగ్ మొదలైపోతోంది. డిసెంబరులోగా మళ్లీ అనుష్క మామూలు స్థాయికి వచ్చేయాలి. అయితే.. ఆ ప్రయత్నం అంత సాఫీగా సాగడం లేదని తెలుస్తోంది. `ఒకేసారి బరువు తగ్గడం ప్రమాదం... కొంచెం టైమ్ తీసుకో. మెల్లమెల్లగా తగ్గు` అంటూ డాక్టర్లు అనుష్కకి సలహా ఇచ్చారట. అయితే ఇదంతా ముందే ఊహించిన దర్శకుడు ప్రకాష్ కోవెల మూడి మాత్రం.. అనుష్కని ముందే హెచ్చరించారట. `కృత్రిమ పద్ధతుల ద్వారా లావైనట్టు చూపిద్దాం.. బరువు పెరగాల్సిన అవసరం లేదు` అన్నారట. అయితే అనుష్క మాత్రం అందుకు ఒప్పుకోలేదట. కృత్రిమంగా బరువు పెరిగినట్టు చూపిస్తే.. ప్రేక్షకులు హర్షించరు.. ఎన్ని కేజీలు పెరగాలో చెప్పండి అంటూ ఛాలెంజింగ్ గా తీసుకొని బరువు పెరిగిందట.
అయితే.. ఇప్పుడు మాత్రం తగ్గడానికి నానా అవస్థలు పడుతోందని సమాచారం. అనుష్క ఇదే సైజులో కనిపిస్తే... తన సినిమా కెరీర్ దాదాపుగా ముగింపు దశకు చేరుకొన్నట్టే. అంటే ఒక సినిమా కోసం తన కెరీర్‌నే పణంగా పెట్టిందన్నమాట. నిజంగా.. ఇంత రిస్క్ ఏ కథానాయికా తీసుకోదు. అందుకే మరి అనుష్క లేకపోతే సైజ్ జీరో సినిమానే లేదని చిత్రబృందం ముక్త కంఠంతో చెబుతోంది. అది.. అనుష్క అంటే.