ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్.. రామ్ ఈ సినిమా చేయడం కరెక్టేనా..?
on Nov 19, 2025

ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ విడుదల
స్టార్ హీరో అభిమాని పాత్రలో రామ్
ప్రతి అభిమానికి కనెక్ట్ అయ్యే కథ
రామ్ కమ్ బ్యాక్ ఇస్తాడా?
ఎనర్జిటిక్ హీరోగా యూత్ లో మంచి గుర్తింపు పొందిన రామ్ పోతినేని.. మాస్ జపం చేసి, గత మూడు చిత్రాలతో పరాజయాలను చూశాడు. ఇప్పుడు రూట్ మార్చి 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అభిమాని బయోపిక్ గా మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, నవంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టనుంది.
స్టార్ హీరో అభిమాని కథగా ఇది తెరకెక్కింది. ఇందులో ఆంధ్ర కింగ్ సూర్య అనే హీరో పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర కనిపిస్తుండగా, అభిమాని సాగర్ పాత్రలో రామ్ కనిపిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. (Andhra King Taluka Trailer)
రెండున్నర నిమిషాల నిడివితో రూపొందిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. "ఏంటి సాగర్.. ప్రింట్ రాకపోతే అద్దాలు పగలగొడతావ్, కాలేజ్ లో గొడవలు పడతావ్, టికెట్లు లేకపోతే పరువుపోయిద్ది అంటావ్.. అసలు పరిచయమే లేని వ్యక్తి కోసం ఇదంతా ఏంటి? పిచ్చి కాకపోతే..." అంటూ మహాలక్ష్మి పాత్రధారి భాగ్యశ్రీ అడిగే మాటతో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ ఒక్క డైలాగ్ తోనే సూర్యకు సాగర్ ఎంతటి వీరాభిమానో అర్థమవుతోంది.
Also Read: ఈ వారం సినీ ప్రియులకు మెగా ట్రీట్
అసలు పరిచయమే లేని హీరో కోసం కొందరు పడి చచ్చిపోతుంటారు. ఫ్యామిలీ, కెరీర్ గురించి ఆలోచించకుండా.. ఆ హీరో సినిమాలే జీవితం అన్నట్టుగా బ్రతుకుతుంటారు. అలాంటి అభిమాని ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటాడు వంటి అంశాలను కూడా ట్రైలర్ లో చూపించారు.
"నువ్వెంత? నీ బతుకెంత? నా థియేటర్లో నాలుగు టికెట్ ముక్కలు సంపాదించుకోవడానికి తప్ప.. బయట అడుగుపెడితే దేనికి పనికొస్తావురా?", "జీవితం అంటే సినిమా కాదు.. బయటకురా", "మేమైతే దీనిని పిచ్చే అంటాం సాగర్" వంటి డైలాగ్ లు.. అభిమానం అనే సంద్రంలో సాగర్ ఎంత లోతుగా మునిగిపోయాడో తెలుపుతున్నాయి.
అలాగే, అసలు అభిమాని సాగర్ ఎవరో తెలుసుకోవడం కోసం హీరో సూర్య ప్రయత్నించడం ఆసక్తికరంగా ఉంది. "వాడు ఉన్నాడని నాకు తెలియకపోవచ్చు.. కానీ, నేనొకడ్ని ఉన్నానంటే అది వాడి వల్లే" అంటూ సూర్య చెప్పిన డైలాగ్.. అభిమానులు లేకపోతే హీరోలకు జీవితం లేదని చెప్పినట్టుగా ఉంది.
సాయంత్రం వేళ సముద్రం ఒడ్డున నిల్చొని సూర్యుడిని చూపిస్తూ.. "సూర్య, సాగర్.. రెండూ కలిసినట్టే ఉంటాయి కానీ, ఎప్పటికీ కలవవురా" అని రాహుల్ రామకృష్ణ అనగా.. "కలవకపోయినా చూశావరా.. చూడటానికి ఎంత బాగుందో" అంటూ రామ్ చెప్తాడు. స్వచ్ఛమైన అభిమానాన్ని తెలిపేలా ఆ డైలాగ్ ఉంది. ఆ డైలాగుతో ట్రైలర్ ను ముగించిన తీరు మెప్పించింది.
'ఆంధ్ర కింగ్ తాలూకా' ఒక అభిమాని కథ అయినప్పటికీ.. ఇందులో లవ్, కామెడీ, ఎమోషన్ అన్నీ ఉన్నాయి. మొదట ఒక ఫ్యాన్ స్టోరీతో సినిమా అన్నప్పుడు.. కొందరు రామ్ స్టోరీ సెలక్షన్ పై అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో కొత్తగా చెప్పడానికి ఏముంటుంది అనుకున్నారు. కానీ, తాజా ట్రైలర్ ఆ అనుమానాలు అన్నింటినీ పటాపంచలు చేసింది.
ట్రైలర్ చూస్తుంటే.. 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా ప్రతి ఒక్క అభిమానికి కనెక్ట్ అయ్యే సినిమా అనిపిస్తుంది. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఆ హీరో, ఈ హీరో అనే తేడా లేకుండా అందరి హీరోల అభిమానులు 'ఆంధ్ర కింగ్ తాలూకా' చూడటానికి ఆసక్తి చూపే అవకాశముంది. అదే జరిగితే, రామ్ కోరుకున్న విజయం దక్కినట్టే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



