AOR Trailer: 'అనగనగా ఒక రాజు' ట్రైలర్.. సంక్రాంతికి నవీన్ సర్ ప్రైజ్ హిట్ కొడతాడా?
on Jan 8, 2026

ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో 'అనగనగా ఒక రాజు' ఒకటి. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమాకి మారి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ కామెడీ ఫిల్మ్ జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రోమోలు, సాంగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. (Anaganaga Oka Raju Trailer)
'అనగనగా ఒక రాజు' ట్రైలర్ కి నాగార్జున వాయిస్ ఓవర్ అందించడం విశేషం. "అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి చాలా పెద్ద మనసు. ఆ మనసులోకి ధగధగా మెరిసిపోయే నగలు వేసుకొని యువరాణి దిగింది" అంటూ నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది.
ఊరి పెద్దమనిషిలా బుల్లెట్ బండి మీద నవీన్ పొలిశెట్టి పాత్రను పరిచయం చేసిన తీరు బాగుంది. నోట్ల కట్టను గుడిలోని హుండీలో వేయబోతూ "కన్నాన్ని పెద్దది చేయండి" అని పూజారితో చెప్పడం భలే ఉంది. ట్రైలర్ లోని ప్రతి సంభాషణ గిలిగింతలు పెడుతోంది. మంత్రాన్ని తిరిగి చెప్పమని పూజారి అంటే.. మీనాక్షి చౌదరి గుండ్రంగా తిరగడం నవ్వులు పూయించింది.
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి పాత్రలను మలిచిన తీరు, ఆ పాత్రల నుంచి హాస్యాన్ని పుట్టించిన తీరు కట్టిపడేసింది. నవీన్, మీనాక్షి ప్రేమకథకు వచ్చిన సమస్య ఏంటి? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? అనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. "పండగకు అల్లుడు వస్తున్నాడు" అంటూ ఎద్దులబండిపై నవీన్ ను చూపిస్తూ సంక్రాంతికి పండుగను ముందుగానే తీసుకొచ్చారు.
సంక్రాంతి అంటేనే కుటుంబంతో కలిసి చూసి మనస్ఫూర్తిగా నవ్వుకునే సినిమాలకు పెట్టింది పేరు. ఈ సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా 'అనగనగా ఒక రాజు' చిత్రం తెరకెక్కిందని ట్రైలర్ తో స్పష్టమైంది.
నవీన్ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్ తో మరోసారి మెప్పించాడు. నవీన్, మీనాక్షి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. యువరాజు కెమెరా పనితనం, మిక్కీ జె మేయర్ నేపథ్య సంగీతం ట్రైలర్ కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ట్రైలర్ తో 'అనగనగా ఒక రాజు'పై అంచనాలు రెట్టింపు అవుతాయి అనడంలో సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



