దేవర నువ్వే కాపాడాలి..!
on Sep 9, 2024
ఒకప్పుడు ఏడాదికి అర డజనుకు పైగా స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యేవి. గతేడాది కూడా స్టార్ హీరోల సినిమాలు బాగానే విడుదలయ్యాయి. కానీ ఈ ఏడాది పెద్దగా హడావుడి లేదు. పెద్ద సినిమాలను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని చూస్తున్న సినీ అభిమానులను ఈ ఏడాది బాగా నిరాశ పరిచింది. ఇప్పటిదాకా రెండంటే రెండే పెద్ద సినిమాలు విడుదలయ్యాయి.
జనవరిలో మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' విడుదలైంది. కానీ అది ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇక ఆ సినిమా వచ్చిన ఐదు నెలలకు జూన్ లో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' రిలీజ్ అయింది. ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు థియేటర్లకు కదిలేలా చేసిన ఈ మూవీ.. వరల్డ్ వైడ్ గా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. 'కల్కి' తర్వాత మళ్ళీ అదే తంతే. పెద్ద సినిమాల ఊసే లేదు. మూడు నెలల గ్యాప్ తర్వాత.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' రూపంలో మరో భారీ సినిమా రాబోతుంది. (Devara Movie)
'కల్కి' తర్వాత మళ్ళీ ఆ స్థాయి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్' వంటి మీడియం రేంజ్ సినిమాలు వచ్చి దారుణంగా నిరాశపరిచాయి. 'సరిపోదా శనివారం' పరవాలేదు అనిపించుకున్నప్పటికీ, అందరినీ థియేటర్ల బాట పట్టేలా చేయలేకపోయింది. పైగా వర్షాల ప్రభావం కూడా వసూళ్లపై పడింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 27న విడుదల కానున్న భారీ చిత్రం 'దేవర' పైనే అందరి దృష్టి నెలకొంది.
అసలే 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం. దానికి తోడు 'కల్కి' తర్వాత మూడు నెలల గ్యాప్ తో వస్తున్న బడా సినిమా కావడంతో.. 'దేవర' కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూస్తున్నారో.. ఓవర్సీస్ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్ బుకింగ్సే అలా ఉంటే.. ఇక తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి అనడంలో సందేహం లేదు. విడుదలయ్యాక దేవర సినిమాకి పాజిటివ్ టాక్ కూడా తోడైతే.. బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా చెడుగుడు ఆడేస్తుంది. 'కల్కి' తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టేలా చేసే అవకాశముంది.
Also Read