మనసును మీటే...మనసు కవి - ఆత్రేయ
on Sep 13, 2014
చూడాలనుకున్నా మనసు కనిపించదు..కానీ, ఆత్రేయ పాటలో మనసు కనిపిస్తుంది.
పలకాలనుకున్నా మనసు పలుకలేదు..కానీ, ఆత్రేయ మాటలో మనసు పలుకుతుంది.
‘ఆత్రేయ’ మాట - పాటలను... సంధించడంలో ఆరితేరిన సవ్యసాచి.
ఆయన తల్లి ఏ మాటలు చెప్పి..,గోరుముద్దలు తినిపించిందో.., ఏ పాటలు పాడి నిదురబుచ్చిందో.., తెలియదుగానీ, ‘ఆత్రేయ’ మనకు భౌతికంగా దూరమై నేటికి ఇరువది ఐదు సంవత్సరాలు గతించినా, ఆయన మాటలతో నేటికీ మన మనసులను పలకరిస్తూనే ఉన్నాడు.., పాటలతో నిదురబుచ్చుతూనే ఉన్నాడు.
‘మనో విపంచిని శృతి చేసి మీటగలిగే..మనసు కవికే అది సాధ్యం.’
1921 మే 7వ తేదీన నెల్లూరు గడ్డమీద పుట్టిన ఈ ‘ఆత్రేయ’ సగోత్రీకుని అసలు పేరు ‘కిళంబి వేంకట నరసింహాచార్యులు’. ‘ఆత్రేయ’ అన్నది ఆయన కలం పేరు. పాటల రచయతగా ఆయన చలనచిత్ర రంగ ప్రస్థానం 1951లో ‘దీక్ష’ చిత్రంతో ప్రారంభమై.. సుమారు 38 సం.లు తెలుగు ప్రేక్షకుల మనోసీమలలో పాటల పతాకాలు ఎగురవేసి.. కాలం కౌగిటిలో కనుమరుగై రెండున్నర దశాబ్దాలు గడిచినా... నేటికీ ఆయన విజయగీతికల రెపరెపలు మనకు వీనులవిందులు చేస్తూ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
ఆయన ‘కోడెకారు చిన్నవాడా..వాడిపోని వన్నెకాడా’ అంటూ తన పాటలో కుర్రకారును ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల’ చినదాని వెంట పరుగులు తీయించారు.
‘నీవు లేక వీణ..పలుకలేనన్నదీ’ అన్న పాటలో విరహోత్కంఠ నాయకి మనోవేదనను ప్రేక్షకుల కన్నుల ముందు ప్రత్యక్షం చేసారు.
‘శిలలపై శిల్పాలు చెక్కినారు’ అంటూ హంపీ విజయనగర శిల్పసౌందర్యాలను గుడ్డివాళ్ళుకు సైతం దర్శింప చేసిన ఘనత ఆయన పాటలది.
మనసుకు భాష ఉండదు అంటారు. ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ అని మనసు యొక్క భాషను మనకు పరిచయం చేసారు ‘ఆచార్య ఆత్రేయ’.
‘తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము’ అని చిలిపిగా ప్రశ్నించినా...
‘అది ఒక ఇదిలే...అతనికి తగులే’ అంటూ మత్తుగా పలికినా...
‘కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి’ అని గారంగా కలహించినా...
‘కళ్ళలో ఉన్నదేమో కన్నులకే తెలుసు’ అని గడుసుగా బదులిచ్చినా...
‘ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా’ అని దేవుని సైతం నిలదీసినా...
‘కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు..ఎర్రెక్కీ ఉన్నోళ్ళు’ అని ఉడుకు రక్తం చేత చిందులేయించినా..
‘సిరిమల్లె పూవల్లె నవ్వు’ అని కొంటెగా ప్రియురాలిని శాసించినా...
‘ప్రేమ ఎంత మథురం..ప్రియురాలు అంత కఠినం’ అని ప్రేమను నక్కచ్చిగా నిర్వచించినా
‘నీ సుఖమే నే కోరుకున్నా..అందుకె నినువీడి వెడుతున్నా..అని వేదన వ్యక్తం చేసినా..
‘నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది’ అని నిత్యసత్యాలు ప్రవచించినా..అది ‘ఆత్రయ’కే చెల్లు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ పాట ‘ప్రేమ్ నగర్’ చిత్రంలోనిది. ఈ పాటలో నటించడానికి ‘అక్కినేని నాగేశ్వర్రావు’ సెట్స్ మీదకు వచ్చి, తొలిసారిగా ఈ పాట విని, ‘ఏమిటండీ ఈ పాట.. అర్థం పర్థం లేకుండా ఉంది.. నేను నటించను’ అని దర్శకుడు కె.యస్.ప్రకాశరావుతో అన్నారట. వెంటనే ‘ఆత్రేయ’ను రప్పించి తమ సందేహాన్ని అడిగారు. ‘ఇందులో సందేహమేముంది. జమీందారు కుటుంబంలో పుట్టినందుకు ఈ లోకం మిమ్మల్ని మెచ్చుకుంది. అందుకే ‘నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది’ అని రాసాను. పసిబిడ్డ పుట్టగానే ఏడవాలి. అలా ఏడవకపోతే పురిటిగదిలో ఉన్నవారికీ టెన్షనే, బయటవున్న బంధువులకూ టెన్షనే. పుట్టిన బిడ్డ ఏడిస్తే బంధువులు ఆనందంతో నవ్వుతారు. అందుకే ‘నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది’ అని రాసాను. ధనవంతుల పిల్లలు నవ్వుతూ ఆనందంగా ఉంటే..ఈ లోకం అసూయతో ఏడుస్తంది. అందుకే.. ‘నేను నవ్వాను ఈ లోకంఏడ్చింది’ అని రాసాను. ఇలాంటి లోకాన్ని ధనవంతులెవరూ పట్టించుకోరు. అందుకే ‘నాకింక లోకంతో పని ఏముంది’ అని రాసాను... అని జవాబు చెప్పారు ఆత్రేయ. అంతే..మరో మాటకు తావులేకుండా ఆ పాటను చిత్రీకరించడం జరిగింది. ఆ పాట ఎంత పాప్యులర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఇంక మాటల విషయానికి వస్తే., ఇదే చిత్రంలో ‘కని, పెంచడమే పెద్దరికమనుకుంటే రాళ్ళకు, రప్పలకు కూడా వస్తుంది’ అన్న ఒక్క మాట చాలు .. ఆయన మాటలో వాడి, వేడి తెలియడానికి.
‘ఆత్రేయ నుంచి పాట తీసుకోవాలంటే నిర్మాత ఏడవాల్సిందే’ అనే అపప్రథ ‘ఆత్రేయ’కు ఉంది. ఇదే మాట ఆయన దగ్గ అంటే ‘నిజమే .. నాచేత పాట రాయించుకోవడానికి నిర్మాతలు ఏడుస్తారు, రాసాక విని ప్రేక్షకులు ఏడుస్తారు, కానీ పాట రాయడానికి ఆత్రేయ ఎంత ఏడుస్తాడో ఎవరికి తెలుసు’ అని చమత్కరించారట. ‘మూగమనసులు’ చిత్రంలో ఒక విషాద గీతం రాసిమ్మని ఆత్రేయకు చెప్పారు. ఎన్ని రోజులైనా పాట రాయలేదు. రెండు మూడుసార్లు షూటింగు పెట్టుకుని, రద్దు కూడా చేసుకున్నారు. ఒక సందర్భంలో నిర్మాత, దర్శకుడు కూడా ఆత్రేయతో గొడవ పడ్డారు కూడా. అప్పుడు విసుగు చెందిన ఆత్రేయ ‘నేనేం రాయి రప్పను, మాను మాకును కాదు..మామూలు మనిషిని’ అన్నారట. ఆ మాటలే పాట రూపం దాల్చాయి.‘రాయి రప్పను కాను..మాను మాకును కానే కాను..మామూలు మడిసిని నేను’ అనే పాట నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది.
ఇలా నెమరువేసుకుంటూ పోతే ఆయన ఙ్ఞాపకాల పరంపరలకు అంతు ఉండదు. ‘విధి చేయు వింతలెన్నో’ అని విధి లిఖితాన్ని పాటలో చెప్పిన ఈ మనసుకవి ‘మనసు గతి ఇంతే.., మనిషి బతుకింతే’ అంటూ మనకు ‘టా టా వీడుకోలు..గుడ్ బై ..ఇంక సెలవు’ అని చెప్పి, కడసారిగా ‘భారతమాతకు జేజేలు..బంగరుభూమికి జేజేలు’ అని మాతృభూమికి నమస్కరించి..1989 సెప్టెంబరు 13వ తేదీన తిరిగిరాని లోకాలకు తరలిపోయి నేటికి పాతిక సంవత్సరాలవుతున్నా..ఆయన అంతరంగాల స్పందనలు, మన మనసులను ఎప్పుడూ గిలిగింతలకు గురిచేస్తూనే ఉంటాయి. ఆత్రేయ మరణించలేదు. ఆయన అమరుడు. ఆయన విరబూసిన ‘ముద్దబంతి పూవులో’ ఉంటాడు..‘మూగకళ్ళ ఊసులో’ ఉంటాడు. మనసున్న ప్రతి మనిషి మనసులోనూ.. పాట రూపంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాడు. ఆ మనసు కవికి ఈ అక్షర నివాళులర్పిస్తూ వారి ఆశీసులను కోరుకుంటోంది ‘తెలుగు వన్’.
- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం