మెగాహీరోతో ఆ డైరెక్టర్ మళ్లీ పెట్టుకొంటాడా?
on Oct 27, 2014
మురుగదాస్.... ఈ సంచలన దర్శకుడు తెలుగులో మరో సినిమా తీయబోతున్నాడన్నది టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్. రమణ, గజిని సినిమాలతో స్టార్ దర్శకుడైపోయిన మురుగదాస్ తొలి సారి తెలుగులో స్టాలిన్ తీశాడు. ఆ సినిమా పరాజయం పాలైంది. దానితో పాటు మురుగదాస్‌కి కొన్ని పాఠాలు నేర్పింది. తెలుగులో చిరంజీవిలాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం కంటే పెద్ద పొరపాటు మరోటి లేదని అర్థమైంది. ఎందుకంటారా...?? ఆ సినిమా కాన్సెప్ట్‌లో, టేకింగ్‌లో చిరు విపరీతంగా కలగజేసుకొన్నాడట. మురుగదాస్ రాసుకొన్న కథ ఒకటైతే.. దానికి చిరు భారీ మార్పులూ, చేర్పులూ చేసి, మధ్యలో పరుచూరి బ్రదర్స్ తమ తాలుకూ పరిజ్ఞానం జోడించి ఆ కథనికి కిచిడీగా మార్చేశారట. దాంతో మురుగదాస్ ఆలోచనలు తెరపై రిఫ్లెక్స్ కాలేదు. ఆ సినిమా ప్రమోషన్స్‌లోనూ మురుగదాస్ ఎక్కడా కనిపించలేదు కూడా. స్టాలిన్ తరవాత తెలుగులో సినిమా చేయకూడదని మురుగదాస్ గట్టిగా డిసైడై.. తమిళంలోనూ, హిందీలోనూ సినిమాలు తీసుకొంటూ వెళ్లాడు. మహేష్‌బాబు నుంచి కబురొచ్చినా... మురుగదాస్ - నో చెప్పాడు. అలాంటిది మళ్లీ ఇంతకాలానికి మురుగదాస్ చేతిలో ఓ తెలుగు సినిమా పెట్టబోతున్నారు.
విజయ్ - మురుగదాస్ కలయికలో వచ్చిన చిత్రం కత్తి. తమిళంలో విడుదలై... మంచి వసూళ్లు రాబట్టుకొంటోంది. ఈసినిమా డబ్ వెర్షన్ తెలుగులో త్వరలో విడుదల చేయబోతున్నారు. డబ్ కంటే.. ఈ కథని పవన్ కల్యాణ్‌తో రీమేక్ చేస్తే బాగుంటుందని నిర్మాతల భావన. ఎందుకంటే విజయ్ సినిమాలు... పవన్‌కి బాగా కలిసొచ్చాయి. తమిళంలో విజయ్ చేసిన సినిమాల్ని తెలుగులో పవన్ చేసి హిట్లు కొట్టాడు. దానికి తోడు పవన్ - మురుగదాస్ కాంబినేషన్ అంటే.. ఆ సినిమా క్రేజ్ ఓ స్థాయిలో ఉంటుంది. అందుకే నిర్మాత ఠాగూర్ మధు పవన్‌ని, మురుగదాస్‌నీ ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. పవన్ సైడ్ నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోవచ్చు. కానీ మురుగదాస్ మాత్రం ఒప్పుకొంటాడా అనేది అనుమానం. ఎందుకంటే... తన పనిలో మరొకరి జోక్యాన్ని అంగీకరించని రకం.. మురుగదాస్. ఆల్రెడీ అన్నయ్య తో చేదు అనుభవాన్ని చవిచూశాడు. పవన్ కల్యాణ్ కూడా దర్శకుల పనిలో జోక్యం చేసుకొంటాడన్నది బహిరంగ రహస్యమే. అందుకే మురుగ ఎలాంటి స్టెప్ తీసుకొంటాడన్నది ఆసక్తిగా మారింది. ఒక వేళ మురుగదాస్ ఈ కథని చేయడానికి ఒప్పుకొన్నా. ''నా పనిలో జోక్యం చేసుకోవద్దు'' అని కండీషన్ పెట్టి మరీ రంగంలోకి దిగే ఛాన్సుందని టాలీవుడ్ పెద్దలు చెప్పుకొంటున్నారు. చూద్దాం... ఏమవుతుందో...?