డీవీడీలు దులపమంటున్న త్రివిక్రమ్
on Jun 3, 2016
తన మాటలతో, పంచ్‌లతో, మేకింగ్ స్టైల్‌తో తెలుగు సినిమాకి కొత్త కళ తెచ్చాడు త్రివిక్రమ్. ముఖ్యంగా పంచ్ డైలాగులతో కొత్త ట్రెండ్ మొదలైంది. ఎవరు పంచ్ రాసినా.. అది త్రివిక్రమ్ చలవే అనుకొనేంత స్థాయికి వెళ్లింది. అ.ఆతో ఇప్పుడు తాజాగా మరో ట్రెండ్‌కి నాంది పలికాడు. అ.ఆ ఓ సాధారణ ప్రేమకథ. కథలో గొప్ప మలుపులేం లేవు. పైగా పాత సినిమానే మార్చి తీసి.. అందరినీ ఏమార్చాడు త్రివిక్రమ్.
విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన మీనాకు అ.ఆకూ దగ్గర పోలికలున్నాయి. మీనా కూడా ఓ నవల ఆధారంగా తెరకెక్కినదే. ఇప్పుడు అదే నవలని త్రివిక్రమ్ అ.ఆ సినిమాగా మలిచాడు. డిటో కాకపోయినా... ఆ పాత్రలే అ.ఆ సినిమాకు ఆధారంగా చేసుకొన్నాడు. దీన్ని బట్టి ఓ సంకేతాన్ని త్రివిక్రమ్ తెలుగు దర్శక నిర్మాతలకు అందించినట్టైంది. కథల కోసం ఎక్కడెక్కడో వెదకొద్దు.. పాత సినిమాల డీవీడీల దుమ్ము దులపండి.. కచ్చితంగా కథలు దొరుకుతాయ్... అనే విషయాన్ని త్రివిక్రమ్ నిరూపించాడు కూడా. కాబట్టి దర్శకుల రీమేక్‌లనో, ఫ్రీమేక్‌లనో.. జుత్తు పీక్కోకుండా.. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో తెలుగులో వచ్చిన సినిమాలన్నీ ఓసారి ముందరేసుకొనిచూస్తే కచ్చితంగా ఓ ఐడియా పుట్టుకొస్తుంది. ఆ ఐడియాలతో అ.ఆలాంటి సినిమాలు బోలెడు తీయొచ్చు. కాదంటారా??