హద్దుల్ని చెరిపేస్తోన్న 'సామజవరగమన'
on Oct 25, 2019

'సామజవరగమన' సాంగ్ హద్దుల్ని చెరిపేసుకుంటూ ముందుకు మునుముందుకు దూసుకుపోతోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న 'అల.. వైకుంఠపురములో' మూవీలోని తొలిపాటగా 'సామజవరగమన' యూట్యూబ్‌లో విడుదలైంది. తమన్స్ స్వరాలు కూర్చగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ పాటను సిద్ శ్రీరాం ఆలపించాడు. 'అల.. వైకుంఠపురములో' మ్యూజిక్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ సెప్టెంబర్ 28న ఈ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. తమన్, సిద్ శ్రీరాం పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లుగా ఉన్న ఆ సాంగ్ రిలీజైన దగ్గర్నుంచీ మ్యూజిక్ లవర్స్‌ను అమితంగా అలరిస్తూ, సెన్సేషనల్ సాంగ్‌గా పేరు తెచ్చుకుంది. స్వల్ప కాలంలోనే వ్యూస్ పరంగా రికార్డుల్ని సృష్టిస్తూ వచ్చింది.
రిలీజైన 24 గంటల్లోనే 6 మిలియన్ వ్యూస్, 3 లక్షల 13 వేల లైక్స్ సాధించిన తొలి సింగిల్‌గా అది రికార్డు సృష్టించింది. ఇప్పుడు అతి స్వల్ప కాలంలోనే 51 మిలియన్ వ్యూస్, 7 లక్షల 90 వేల లైక్స్ సాధించిన సాంగ్‌గా మరో రికార్డును సాధించింది 'సామజవరగమన' సాంగ్. సోషల్ మీడియాలో అది వైరల్ అయిన తీరు అసాధారణం. రానున్న కాలంలో అది 100 మిలియన్ వ్యూస్ మార్కును దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోన్న 'అల.. వైకుంఠపురములో' మూవీ జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



