మ్యూజికల్ హిట్ `కిల్లర్`కి 30 ఏళ్ళు.. కొన్ని ఆసక్తికరమైన విశేషాలు!
on Jan 10, 2022

1990ల్లో తెలుగువారిని విశేషంగా అలరించిన వెండితెర జంటల్లో కింగ్ నాగార్జున, గ్లామర్ క్వీన్ నగ్మా జోడీ ఒకటి. వీరిద్దిరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడు సినిమాలు (కిల్లర్, వారసుడు, అల్లరి అల్లుడు) తెరకెక్కగా.. అవన్నీ కూడా మ్యూజికల్ గా మెప్పించాయి. వాటిలో తొలి చిత్రమైన `కిల్లర్` (1992)కి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అందించిన బాణీలు.. ఎస్సెట్ గా నిలిచాయి. మరీముఖ్యంగా.. ``ప్రియా ప్రియతమా`` (వేటూరి సాహిత్యం - మనో, చిత్ర గానం) ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలిచింది. ఈ జనవరి 10తో `కిల్లర్` విడుదలై సరిగ్గా 30 ఏళ్ళు. ఈ సందర్భంగా `కిల్లర్`కి సంబంధించి కొన్నిఆసక్తికరమైన విశేషాలు..
* `కిల్లర్`ని మలయాళ దర్శకుడు ఫాజిల్ తెరకెక్కించారు. ఈ ఫాజిల్ మరెవరో కాదు.. ప్రస్తుతం మాలీవుడ్ లో వెర్సటైల్ ఆర్టిస్ట్ గా పేరుపొందుతూ, రీసెంట్ గా `పుష్ప - ద రైజ్`తో తెలుగువారిని కూడా అలరించిన ఫహద్ ఫాజిల్ కి తండ్రి. మలయాళ, తమిళ భాషల్లో పలు సినిమాలు రూపొందించిన ఫాజిల్ కి ఇదే ఏకైక తెలుగు చిత్రం కావడం విశేషం.
* జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థలో నాగ్ నటించిన రెండో సినిమా `కిల్లర్`. అంతకుముందు ఆ సంస్థ అధినేత, దర్శకుడు వీబీ రాజేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో `కెప్టెన్ నాగార్జున్` (1986) చేశారు నాగ్. `కెప్టెన్ నాగార్జున్` కోసం ఖుష్బూతో తొలిసారిగా జట్టుకట్టిన నాగ్.. `కిల్లర్`లో నగ్మాతో మొదటిసారిగా జోడీకట్టారు. రెండు సినిమాలు కూడా ఆంగ్లాక్షరం `కె`తోనే ప్రారంభం కావడం విశేషం.
* తమిళంలో `కిల్లర్` చిత్రాన్ని `ఈశ్వర్` పేరుతో 1992 అక్టోబర్ లో రిలీజ్ చేశారు.
* `కిల్లర్` రిలీజైన రోజు(జనవరి 10)నే విక్టరీ వెంకటేశ్ నటించిన `చంటి` కూడా విడుదలైంది. రెండు సినిమాలకు కూడా ఇళయరాజానే బాణీలు అందించారు. అంతేకాదు.. `కిల్లర్`లో విజయ్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో కనిపించగా, `చంటి`లో ఆయన శ్రీమతి, ప్రముఖ నటీమణి మంజులా విజయ్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో అలరించారు.
* అప్పట్లో అగ్రశ్రేణి బాలనటిగా మంచి గుర్తింపు పొందిన బేబి షామిలి.. నాగార్జునతో కలిసి నటించిన ఏకైక చిత్రమిదే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



