తారాగణం: శివకార్తికేయన్, సాయిపల్లవి, రాహుల్ బోస్, భువన్ అరోరా, గీతా కైలాసం తదితరులు
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
డీఓపీ: సి.హెచ్. సాయి
ఎడిటర్: ఆర్. కలైవానన్
దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, వివేక్ కృష్ణాని
బ్యానర్స్: రాజ్ కమల్ ఫిలిమ్స్, సోనీ పిక్చర్స్
విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024
నిజ జీవిత హీరోల కథలను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. అలా రియల్ హీరో బయోపిక్ గా రూపొందిన చిత్రం 'అమరన్'. 2014లో జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాడి వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఇది రూపొందింది. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ 'అమరన్' మూవీ ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఇది కథ కాదు. వీరుడి జీవితం. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాల సమాహారం. అసలు ముకుంద్ వరదరాజన్ ఎవరు? ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? సైనికుడు కావాలనే కలకు బీజం ఎలా పడింది? కేరళ అమ్మాయి ఇందు రెబెకా వర్గీస్ (సాయి పల్లవి)తో పరిచయం ఎలా ఏర్పడింది? వారి ప్రేమకథ ఏంటి? వారి పెళ్ళికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సైనికుడిగా ముకుంద్ సాధించిన విజయాలేంటి? చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు ఎలా వదిలేశాడు? వంటి విషయాలను సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
బయోపిక్ తీయడం, అందునా ఒక సైనికుడి జీవిత కథను తెరమీదకు తీసుకురావడం అనేది కత్తిమీద సాము లాంటిది. డాక్యుమెంటరీలా ఉన్నది ఉన్నట్టు తీస్తే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. అలా అని కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కథను పక్కదారి పట్టిస్తే.. విమర్శలు ఎదురవుతాయి. అందుకే గీతకి అటు ఇటు కాకుండా బ్యాలెన్స్ తో సినిమా చేయాలి. ఆ విషయంలో దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి బాగానే సక్సెస్ అయ్యాడు. మామూలుగా సైనికుడి కథ అంటే ఉగ్రవాదులతో పోరాడే ఆపరేషన్ల నేపథ్యంలోనే ఎక్కువగా సినిమా నడుస్తుంది. కానీ ఇందులో ముకుంద్ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడం విశేషం. దేశం కోసం కుటుంబానికి దూరంగా ఉంటూ సైనికులు చేసే త్యాగమే కాదు.. ఆ సైనికులకు దూరంగా ఉంటూ, వారికి ఏం జరుగుతోందన్న ఆందోళనతో ఉండే కుటుంబ త్యాగాల గురించి కూడా ఇందులో చూపించారు. ముకుంద్ భార్య ఇందు కోణంలో ఈ కథ నడుస్తుంది. ముకుంద్-ఇందుల పరిచయం మరియు ప్రేమాయణం, ఉద్యోగం రావడంతో ఇద్దరూ దూరంగా ఉండాల్సి రావడం, పెళ్ళికి ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు, ఇండియన్ ఆర్మీలో ముకుంద్ అంచలంచెలుగా ఎదిగే క్రమంతో ప్రథమార్థం నడుస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మనసుని హత్తుకుంటాయి. ముఖ్యంగా ముకుంద్-ఇందు మధ్య సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ద్వితీయార్థం ఎక్కువగా ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ముకుంద్ చేపట్టిన ఆపరేషన్ చుట్టే తిరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల కథనం సాగదీతగా అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు హత్తుకున్నాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
శివకార్తికేయన్, సాయిపల్లవి ల నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్ చక్కగా ఒదిగిపోయాడు. లుక్స్ పరంగా, ఫిజిక్ పరంగా, యాక్టింగ్ పరంగా ఆ పాత్రకు ప్రాణం పోయడానికి ఏం చేయాలో అంతా చేశాడు. ఇక ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటన టాప్ క్లాస్ లో ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో కంటతడి పెట్టించింది.
జి.వి. ప్రకాష్ సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. సాయి కెమెరా పనితనం మెప్పించింది. యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేసిన తీరు బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మేజర్ ముకుంద్ వరదరాజన్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని తెరమీదకు తీసుకురావడానికి చిత్ర బృందం చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినది.