మహేష్ సినిమా కోసం ‘బాహుబలి’ నిర్మాత.. అది రాజమౌళి పనే!
on Nov 21, 2024
‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో రాజమౌళికి మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా కంటే ముందే ‘మర్యాద రామన్న’ చిత్రాన్ని వారి బేనర్‌లోనే నిర్మించారు. మేకింగ్ విషయంలో గానీ, మార్కెటింగ్ విషయంలోగానీ రాజమౌళికి ఒక క్లారిటీ ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ నిర్మాతలు కూడా వ్యవహరించడం, కొన్ని సందర్భాల్లో వారు కూడా రాజమౌళికి అద్భుతమైన సలహాలు ఇవ్వడం జరిగింది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడం వెనుక శోభు యార్లగడ్డ హస్తం ఉందని చెబుతుంటారు. నాటు నాటు పాటను ఆస్కార్ వరకు తీసుకెళ్లడం, ఆస్కార్ కమిటీ వద్ద ఆర్‌ఆర్‌ఆర్ సినిమా స్క్రీనింగ్ చేయించడం వరకు శోభు పాత్ర ఉందని తెలుస్తోంది. ఇప్పుడు మహేష్‌తో చేయబోయే సినిమాకి కూడా శోభు సహకారం అవసరమని రాజమౌళి భావిస్తున్నారట.
శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా శోభు యార్లగడ్డ వ్యవహరిస్తారని తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి చేసే సినిమాలకు సంబంధించి చాలా శాఖల్లో వారి కుటుంబ సభ్యులే పనిచేస్తుంటారు. కథ, సంగీతం, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైనింగ్ వంటి శాఖల్లో అతని కుటుంబ సభ్యులే ఉంటారు. కానీ, మహేష్‌తో చేయబోయే సినిమాకి కొత్తగా శోభు యార్లగడ్డ ఎంటర్ అవుతున్నారని సమాచారం. శోభుపై రాజమౌళికి ఉన్న అపారమైన నమ్మకం కారణంగానే అతన్ని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రపంచస్థాయి మార్కెట్‌ను అందుకునేందుకు రాజమౌళి పక్కాగా ప్లానింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అందరూ భావించారు. కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం.
Also Read