దీపావళి పర్వదినం సందర్భంగా రెండు భాగాల 'బాహుబలి' మూవీ కన్నడంలో ప్రసారం కానున్నది. ఈ మూవీ కన్నడ డబ్బింగ్ రైట్స్‌ను కలర్స్ కన్నడ చానల్ దక్కించుకుంది. నవంబర్ 15న కర్ణాటకలోని ప్రభాస్ అభిమానులను ఈ సినిమా అలరించబోతోంది. ప్రభాస్ టైటిల్ రోల్ పోషించగా రాజమౌళి రూపొందించిన 'బాహుబలి: ద బిగినింగ్', 'బాహుబలి: ద కన్‌క్లూజన్' సినిమాలు ఇదివరకు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ అయ్యి థియేటర్లలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఆ టైమ్‌లో కన్నడ డబ్బింగ్ ఇండస్ట్రీలో గొడవల కారణంగా కన్నడలో అవి డబ్ కాలేదు.
ఓ నెల క్రితమే ఆ సినిమాల డబ్బింగ్ హక్కులను కలర్స్ కన్నడ చానల్ దక్కించుకుంది. అప్పటిదాకా కన్నడ చిత్ర నిర్మాతలకూ, డబ్బింగ్ ఆర్టిస్టుల మధ్య ఘర్షణ కొనసాగుతూ వచ్చింది. డబ్బింగ్ సినిమాల కారణంగా ఒరిజినల్ కన్నడ సినిమాలకు నష్టం కలుగుతోందంటూ అక్కడి నిర్మాతలు ఆరోపిస్తూ వచ్చారు. ఏదేమైనా నవంబర్ 15 సాయంత్రం 4:30 నుంచి వరుసగా రెండు సినిమాలు కన్నడ వెర్షన్‌లో ప్రసారం కానుండటంతో 'బాహుబలి' ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బాక్సాఫీస్ దగ్గర 'బాహుబలి' ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చాలా మందికి తెలిసిందే. తెలుగులో రూపొందిన ఆ సినిమా హిందీ, తమిళ, మలయాళం భాషల్లో అనువాదమై, ఆ భాషల్లోనూ అత్యధిక కలెక్షన్లను సాధించింది. మొత్తం రూ. 400 కోట్ల వ్యయంతో రూపొందిన రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లను ఆర్జించాయి.