'హ్యాపీడేస్' లాంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్. రెండో సినిమా 'కొత్త బంగారు లోకం'తోనూ మరో బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ అప్పటి నుంచి వరుస పరాజయాలు వెంటాడాయి. ఆ తర్వాత దాదాపు 20 సినిమాల్లో హీరోగా నటిస్తే అందులో 'ఏమైంది ఈవేళ' మాత్రమే చెప్పుకోదగ్గ విజయం సాధించింది. చివరిగా గతేడాది 'ఇందువదన' చిత్రంతో పలకరించాడు. ఈ పదేళ్ళలో ఎన్నో సినిమాలు చేసినా ఒక్కటీ సరైన విజయం దక్కలేదు. కొన్ని సినిమాలు ఎప్పుడొచ్చాయో, ఎప్పుడు పోయాయో కూడా తెలీదు. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ తనను తాను కొత్తగా పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విభిన్న పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టాడు.
సందీప్ కిషన్ హీరోగా నటించిన 'మైఖేల్' సినిమా రేపు(ఫిబ్రవరి 3న) ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ తో పాటు వరుణ్ సందేశ్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో వరుణ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటిదాకా వరుణ్ అంటే లవర్ బాయ్ గానే ప్రేక్షకులకు ఎక్కువగా తెలుసు. కానీ 'మైఖేల్' నుంచి తన రూట్ పూర్తిగా మార్చేసినట్టున్నాడు. ఇందులో ఆయన పొడవాటి జుట్టు, గడ్డంతో విభిన్నంగా కనిపిస్తున్నాడు. గెటప్ తో పాటు పాత్రలోనూ వైవిధ్యం కనిపిస్తోంది. దీనితో పాటు 'యద్భావం తద్భవతి' అనే మరో చిత్రం చేస్తున్నాడు వరుణ్. అందులో కూడా ఈ తరహా లుక్ లోనే చేతికి సంకెళ్లు, నోట్లో సిగరెట్, గన్స్ తో మాస్ గా కనిపిస్తున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ ని పక్కన పెట్టి, విభిన్న పాత్రలతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్న వరుణ్ కి సెకండ్ ఇన్నింగ్స్ ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.