తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సాగర్(విద్యాసాగర్ రెడ్డి) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు.
'రాకాసి లోయ' చిత్రంతో డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభించిన సాగర్ దాదాపు 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 'అమ్మ దొంగ', 'స్టువర్టుపురం దొంగలు' వంటి హిట్ సినిమాలను అందించారు. ఆయన దర్శకత్వం వహించిన 'రామసక్కనోడు' చిత్రానికి మూడు నంది పురస్కారాలు లభించాయి. వీవీ వినాయక్, శ్రీను వైట్ల, రవికుమార్ చౌదరి లాంటి ప్రతిభావంతులైన దర్శకులు ఆయన శిష్యులే. అలాగే ఆయన తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పని చేశారు. సినీ పరిశ్రమకు మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన 70 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో గురువారం నాడు మరణించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.