2013 నాటి క్రైమ్ కామెడీ డ్రామా 'స్వామి రారా'తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు సుధీర్ వర్మ. నిఖిల్, స్వాతి జంటగా నటించిన ఈ సినిమాతో విషయమున్న దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు పొందాడు. అలాగే, కమర్షియల్ సక్సెస్ ని సైతం సొంతం చేసుకున్నాడు. కట్ చేస్తే.. ఆ తరువాత ట్రాక్ తప్పాడు సుధీర్. నాగచైతన్యతో తీసిన 'దోచేయ్' (2015) తీవ్రస్థాయిలో నిరాశపరచగా.. తన ఫస్ట్ ఫిల్మ్ హీరో నిఖిల్ తో చేసిన 'కేశవ' (2017) ఫర్లేదనిపించుకుంది. అనంతరం శర్వానంద్ తో తీసిన 'రణరంగం' (2019) మరో డిజాస్టర్ గా నిలిచింది.
ఈ నేపథ్యంలో.. తదుపరి చిత్రంపైనే తన ఆశలు పెట్టుకున్నాడు సుధీర్. తన గత చిత్రాలకు భిన్నంగా ఈ సారి ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ని డీల్ చేస్తున్నాడు వర్మ. కొరియన్ మూవీ 'మిడ్నైట్ రన్నర్స్' ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రెజీనా, నివేదా థామస్ నాయికలుగా నటించారు.
డి. సురేశ్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ.. ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కానుందని సమాచారం. అంతేకాదు.. 'శాకినీ - ఢాకినీ' అనే పేరు ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి.. రెండేళ్ళకో సినిమా అన్న స్ట్రాటజీతో ముందుకు సాగుతున్న సుధీర్ వర్మ.. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతోనైనా సాలిడ్ హిట్ అందుకుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.