కింగ్ నాగార్జున తండ్రీకొడుకులుగా నటించిన `సోగ్గాడే చిన్ని నాయనా` (2016) చిత్రం.. ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో `బంగార్రాజు`(తండ్రి పాత్ర పేరు)గా నాగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. కట్ చేస్తే.. ఇప్పుడు `బంగార్రాజు` పేరుతో `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ సిద్ధమవుతోంది. `సోగ్గాడే చిన్ని నాయనా` కెప్టెన్ కళ్యాణ్ కృష్ణ ఈ సీక్వెల్ కి కూడా మెగాఫోన్ పట్టనున్నారు. అన్నీ కుదిరితే జూలై నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. `బంగార్రాజు`కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో `బంగార్రాజు`కి మనవడి పాత్రలో నాగ్ ద్వితీయ పుత్రుడు అఖిల్ నటించనున్నాడట. అంతేకాదు.. తాత - మనవడు పాత్రల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సీక్వెల్ సాగుతుందని టాక్. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, నాగ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఇక అఖిల్ విషయానికి వస్తే.. అతని తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్`ని పట్టాలెక్కించనున్నాడు.