'దేశముదురు' (2007)తో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన హన్సిక.. అనతికాలంలోనే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. బైలింగ్వల్ మూవీ 'మహా'తో 50 చిత్రాల మైలురాయికి చేరువయ్యారు ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. నాలుగేళ్ళ క్రితం మొదలైన ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీ.. కొన్ని కారణాల వల్ల ఇంకా విడుదలకు నోచుకోలేదు.
ఈ నేపథ్యంలో.. కొన్ని తమిళ వెబ్ సైట్స్ 'మహా'కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిందని.. త్వరలోనే సెన్సార్ కి వెళ్ళనుందని.. కోవిడ్ కారణంగా థియేటర్స్ లో కాకుండా ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుందని కథనాలు ప్రచురించాయి.
అయితే, చిత్ర దర్శకుడు యు.ఆర్. జమీల్ ఈ వార్తలను ఖండించారు. ఇది ఫేక్ న్యూస్ అని.. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి సరైన అప్ డేట్ ని తెలియజేస్తామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శింబు అతిథి పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ మూవీలో శ్రీకాంత్ (శ్రీరామ్), ప్రియా ఆనంద్, సనమ్ శెట్టి, తంబి రామయ్య ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
జిబ్రాన్ సంగీతమందించిన ఈ చిత్రానికి 'మిర్చి', 'శ్రీమంతుడు', 'భాగమతి', 'సాహో' తదితర సినిమాలకు ఛాయాగ్రహణం అందించిన ఆర్. మది సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.