కోలీవుడ్ స్టార్ ధనుశ్, టాలీవుడ్ కామెడీ స్టార్ `అల్లరి` నరేశ్.. ఈ ఇద్దరి దారులు వేరే. ఒకరు విభిన్న పాత్రలతో ముందుకు సాగుతుంటే.. మరొకరు హాస్య పాత్రలతో స్టార్ డమ్ పొంది అడపాదడపా ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే, ఈ ఇద్దరికి సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే.. అటు ధనుశ్, ఇటు `అల్లరి` నరేశ్ హీరోలుగా నటించిన మొదటి సినిమాలు ఒకే రోజున విడుదల కావడం.
ఆ వివరాల్లోకి వెళితే.. తన అన్న సెల్వరాఘవన్ స్క్రీన్ ప్లేతో తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో రూపొందిన `తుళ్ళువదో ఇళమై`(2002)తో ధనుశ్ హీరోగా ఫస్ట్ స్టెప్ వేస్తే.. రవిబాబు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తో తెరకెక్కిన `అల్లరి`(2002)తో నరేశ్ కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. విశేషమేమిటంటే.. 2002 మే 10న విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా విజయం సాధించడమే కాకుండా రీమేక్ బాట పట్టాయి. మరో గమ్మత్తైన విషయమేమిటంటే.. ఈ రెండు చిత్రాల్లోనూ `అల్లరి` నరేశ్ నే నటించడం. `తుళ్ళువదో ఇళమై` తెలుగులో `జూనియర్స్` పేరుతోనూ.. `అల్లరి` తమిళంలో `కురుంబు` టైటిల్ తోనూ పునర్నిర్మితం కాగా.. రెండు రీమేక్ వెర్షన్స్ లోనూ నరేశ్ హీరోగా అలరించారు.
మొత్తమ్మీద.. మే 10 అటు ధనుశ్, ఇటు `అల్లరి` నరేశ్ కి వెరీ వెరీ స్పెషల్ డే అన్నమాట. నేటితో ఈ ఇద్దరి కెరీర్ 19 వసంతాలు పూర్తిచేసుకుంది.