తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశమంతా చాటాలని తెలుగుదేశం పార్టీని మహానటుడు ఎన్టీ రామారావు స్థాపించారని మనకు తెలుసు. అయితే పాలిటిక్స్ అంటే ఇష్టం లేకపోయినా ఎన్టీ రామారావు అందులోకి వెళ్లారా? ఆయన దృష్టిలో రాజకీయాలు నీచమైనవా? ప్రముఖ నటుడు చలపతిరావు చెప్పేదాని ప్రకారమైతే అంతే! చలపతిరావు సినిమాల్లోకి నటుడిగా అడుగుపెట్టినప్పట్నుంచీ ఎన్టీఆర్ మనిషిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే చలపతిరావు అక్కడ ఉండాల్సిందే. ఒకరకంగా చెప్పాలంటే అప్పట్లో ఎన్టీఆర్‌కు ఆయన కుడిభుజంలా వ్యవహరించారు. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆశ్చర్యకరంగా చలపతిరావు సినిమా రంగంలోనే ఉండిపోయారు. తను విపరీతంగా ఆరాధించే ఎన్టీఆర్ కోసం ఆయన రాజకీయాల్లోకి రాలేదు. దీనికి కారణం.. ఎన్టీఆరే ననీ, ఆయనే తనను రాజకీయాల్లోకి రావద్దని చెప్పారనీ చలపతిరావు వెల్లడించారు.
'చండశాసనుడు' సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేశారు. "ఆ సినిమా షూటింగ్ సందర్భంగా ఇద్దరం పొలంలో కూర్చొని ఉన్నాం. 'అన్నయ్యా.. మీరు రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నారు కదా.. మేం కూడా వేషాలు మానేసి వచ్చేయమా?' అనడిగాను. 'వద్దు.. నేను ఇంతలోతు బురదలో దిగిపోయి ఉన్నా. రాజకీయాలంటే దరిద్రం. నీచం. మనవాళ్లందరికీ చెప్పు.. ఇక్కడ వేషాలు రాయించుకొని, మంచి మంచి సినిమాలు తీయమను. సినిమాలు మాత్రం మానొద్దు. సినిమాలు జాతికి ఉపయోగపడతాయ్, సొసైటీకి ఉపయోగపడతాయ్. మనం చెప్పే నీతులు జనం ఫాలో అవుతారు. నేను ఈ దరిద్రపు పాలిటిక్స్‌లో ఇరుక్కుపోయా. దీనిలోంచి నేను బయటకి రాలేను.' అని చెప్పారు." అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు చలపతిరావు.
పెద్దాయన మీకు చెప్పమన్నారంటూ శోభన్‌బాబు, కృష్ణంరాజు, కృష్ణ లకు రామారావు గారి మాటలను చెప్పానని ఆయన తెలిపారు. "అందుకే నేను పాలిటిక్స్‌లోకి వెళ్లలేదు. ఎప్పుడైనా మహానాడు పెడితే పిలిచేవారు, దానికి వెళ్లి, నాటకాలు వేసి వచ్చేవాళ్లం. రాజకీయాల్లోకి వెళ్లినట్లయితే నేను ఎమ్మెల్యే అయ్యేవాడ్నో, మినిస్టర్‌ని అయ్యేవాడ్నో నాకు తెలీదు. ఎందుకంటే ఆ సీజన్‌లో గడ్డిపరకను నిలబెట్టినా గెలిచారు. జనానికి తెలీని మనిషిని తీసుకొచ్చి నిలబెడితే వాడు ఎమ్మెల్యే అయిపోయాడు. అలా గెలిచారు. మేం వెళ్లినట్లయితే మేమూ గెలిచేవాళ్లం. ఆయన చెప్పాడనే మేం పాలిటిక్స్‌లోకి వెళ్లలేదు. ఇప్పటికీ నేను పాలిటిక్స్‌ను పట్టించుకోను." అని చెప్పుకొచ్చారు చలపతిరావు. ఈ రోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.