ఆర్యన్ రాజేశ్‌తో నటించిన 'సొంతం' (2002) చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నమిత. రెండో సినిమాలోనే వెంకటేశ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా 'జెమిని'. మంచి ఒడ్డూ పొడుగూ, వంపుసొంపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు సినిమాల్లో ఉదారంగా అందాలు ప్రదర్శిస్తూ వచ్చిన ఆమె, హఠాత్తుగా బరువు పెరిగిపోయింది. ఫలితంగా ఆమెకు హీరోయిన్ అవకాశాలు సన్నగిల్లిపోయాయి. దీంతో వాస్తవ స్థితిని గ్రహించిన ఆమె ప్రయత్న పూర్వకంగా బరువు తగ్గింది. 2013 తర్వాత మూడేళ్ల పాటు సినిమాలకు దూరమైన ఆమె మోహన్‌లాల్ సినిమా 'పులి మురుగన్'తో రి-ఎంట్రీ ఇచ్చింది.
అప్పుడే విజయ్ టీవీలో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనడం ద్వారా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది నమిత. మొదట్లో వీక్షకుల ఆదరాభిమానాలు బాగానే పొందినప్పటికీ, కొన్ని కారణాల వల్ల షో నుంచి ఆమెను బయటకు పంపేశారు. 2017లో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని పెళ్లాడుతున్నట్లు ప్రకటించింది నమిత. వీరేంద్ర చిత్ర నిర్మాత, మోడల్ కూడా. పెళ్లి తర్వాత కూడా తను ఎంచుకున్న సినిమాలు చేస్తూ వస్తోంది నమిత. జయలలిత జీవించి ఉన్నప్పుడు ఏఐడీఎంకే పార్టీలో ఉన్న ఆమె, జయ మరణానంతరం ఆ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరింది. ఇటీవల జరిగిన తమిళనాటు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిందామె.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో 'నమిత థియేటర్' అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది నమిత. ఎందుకంటే ప్రస్తుతం థియేటర్లు మూతపడటం వల్ల చిన్న, మధ్య తరహా సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ చిన్న సినిమాల నిర్మాతలకు ప్రయోజనకరంగా ఉంటుందని నమిత తెలిపింది. ఆమె ప్రయత్నానికి చాలామంది అభినందనలు తెలియజేశారు. మరి ఈ కొత్త వెంచర్ నమితకు లాభసాటిగా ఉంటుందా, లేదా?.. అనేది కొన్ని నెలల్లో తెలియనున్నది.