జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కరోనా వైరస్ బారి నుంచి బయటపడ్డారు. ఈరోజు ఆయనకు టెస్ట్‌లో నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఏప్రిల్ 19న తనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంతకు ముందు ఆయన స్టాఫ్‌లో కొంతమందికి కరోనా సోకింది. అప్పట్నుంచీ తన ఇంట్లోనే ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్న డాక్టర్లు మూడు రోజుల క్రితం ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈరోజు వాటి ఫలితం వచ్చింది. ఆయనకు కొవిడ్ నెగటివ్‌గా తేలింది. కరోనా వైరస్ సోకిన తర్వాత వచ్చే నిస్త్రాణ లాంటివి పవన్ కల్యాణ్‌కు ఉన్నాయనీ, ఆరోగ్యపరంగా ఇతర ఇబ్బందులు ఏవీ లేవని వైద్యులు తెలిపారు.
తన ఆరోగ్యం, క్షేమం గురించి ఆకాంక్షించిన వారికి, పూజలు-ప్రార్థనలు చేసిన జన సైనికులు, నాయకులు, అభిమానులకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్యనిపుణులు అందిస్తున్న సూచనలను అనుసరించాలని కోరారు.
అంతకు ముందు ఆయన అనారోగ్యానికి చికిత్స పొందుతున్న ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఐసోలేషన్ కాలం ముగిసిన వెంటనే మలయాళ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ షూట్ ను పవన్ తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ ఈ రీమేక్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూట్ జూలై 2021 నాటికి ముగుస్తుంది. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం గురించి మరిన్ని అప్డేట్స్ వస్తాయని భావిస్తున్నారు.