కొత్త దర్శకులకు అవకాశమివ్వడంలో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. అయితే తన తోటి హీరోలతో పోల్చుకుంటే కొంతకాలంగా విజయాల పరంగా నాగార్జున చాలా వెనకపడిపోయాడు. సోలో హీరోగా ఆయన విజయాన్ని అందుకొని చాలా కాలమైంది. ఈ క్రమంలో మరో కొత్త దర్శకుడికి అవకాశమిచ్చి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
రచయిత ప్రసన్నకుమార్ త్వరలో మెగాఫోన్ పట్టబోతున్నాడని న్యూస్ వినిపిస్తోంది. దర్శకుడు త్రినాధరావు నక్కిన రూపొందించిన 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్', 'హాలో ప్రేమ కోసమే' సినిమాలకు ప్రసన్న రైటర్ గా వర్క్ చేశాడు. ఇందులో 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్' సినిమాలు కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి. రవితేజ హీరోగా త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతోన్న 'ధమాకా'కి కూడా ప్రసన్న రచయితగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇతనికి దర్శకుడిగా మొదటి సినిమానే నాగార్జునతో చేసే అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
కథలో కొత్తదనం లేకపోయినా వినోదంతో బోర్ కొట్టకుండా కథని నడిపించడం ప్రసన్న శైలి. అదే శైలిలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథని సిద్ధం చేసి నాగ్ కి వినిపించగా, ఆయనకు నచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగార్జున పరిచయం చేసిన దర్శకుల లిస్టులో ప్రసన్న కూడా చేరిపోతాడని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.