ఒకప్పుడు దర్శకుడిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అప్పట్లో ఆయన డైరెక్ట్ చేసిన సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూసేవారు. కానీ ఇప్పుడు ఆయన సినిమాలను పట్టించుకునే వారే కరువయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన నటుడిగా మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ k' అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రామ్ గోపాల్ వర్మను సంప్రదించినట్టు తెలుస్తోంది.
'ప్రాజెక్ట్ kలో సినిమాకి కీలకమైన ఓ విభిన్న పాత్ర ఉందట. ఈ పాత్ర ఆర్జీవీ చేస్తే బాగుంటుందని భావించిన నాగ్ అశ్విన్.. తాజాగా ఆర్జీవీని సంప్రదించగా పాత్ర నచ్చి ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో నటుడిగా ఆర్జీవీ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.