గోపీచంద్ హీరోగా నటించిన 'జిల్' సినిమాతో రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేయనప్పటికీ.. తన స్టైలిష్ మేకింగ్ తో డైరెక్టర్ రాధాకృష్ణ ఆకట్టుకున్నాడు. దీంతో 'జిల్' చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ తో 'రాధే శ్యామ్' చేసే అవకాశాన్ని ఇచ్చింది. కానీ రాధాకృష్ణ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందిన 'రాధే శ్యామ్' ఘోర పరాజయం పాలైంది. అయినప్పటికీ రాధాకృష్ణకు ముచ్చటగా మూడోసారి దర్శకుడిగా అవకాశం ఇవ్వడానికి యూవీ క్రియేషన్స్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.
'జిల్'తో సూపర్ హిట్ అందించకపోయినా, 'రాధే శ్యామ్'తో డిజాస్టర్ అందించినా.. రాధాకృష్ణ దర్శకత్వ ప్రతిభపై యూవీకి నమ్మకం పోలేదట. ఆయన మూడో సినిమాని కూడా నిర్మించడానికి సిద్ధమైందట. రాధాకృష్ణ చెప్పిన స్టోరీ లైన్ నచ్చి.. గోపీచంద్ తో సినిమా సెట్ చేసే పనిలో ఉందట. గోపీచంద్ కి సైతం ఆయన చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందట. అందుకే 'రాధే శ్యామ్' రిజల్ట్ ని పట్టించుకోకుండా.. తనని 'జిల్'లో స్టైలిష్ గా చూపించాడన్న ఉద్దేశంతో గోపీచంద్ సైతం రాధాకృష్ణతో మరో సినిమా చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం.
ప్రస్తుతం గోపీచంద్ తనకు 'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత రాధాకృష్ణ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందేమో చూడాలి.