'ఆర్ఎక్స్ 100'తో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ తర్వాత 'మహాసముద్రం'తో నిరాశపరిచిన ఆయన.. తన మూడో సినిమాని పెద్దగా హడావిడి లేకుండా సైలెంట్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాకి 'మంగళవారం' అనే ఆసక్తికర టైటిల్ పెట్టినట్టు టాక్.
కొత్త వారితో అజయ్ రూపొందించిన 'ఆర్ఎక్స్ 100'(2018) పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై ఘన విజయం సాధించింది. యూత్ ని విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ డైరెక్టర్ గా అజయ్ కి, హీరోహీరోయిన్లగా కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 'ఆర్ఎక్స్ 100' విడుదలైన మూడేళ్ళ తర్వాత అజయ్ డైరెక్ట్ చేసిన రెండో సినిమా 'మహాసముద్రం'(2021) విడుదలైంది. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మంచి అంచనాలతో విడుదలై పరాజయంపాలైంది. దీంతో మొదటి సినిమా తరహాలోనే కొత్త వాళ్ళతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నాడట.
'మంగళవారం' అనే టైటిల్ తో అజయ్ ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో ప్రేమ, వినోదంతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయట. ఈ చిత్రాన్ని అజయ్ స్వయంగా నిర్మిస్తున్నట్టు సమాచారం. 2023 సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.