ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు కనిపిస్తున్న కొన్ని సినీ జంటలు అనూహ్యంగా విడిపోయి షాకిస్తున్నాయి. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య-సమంత పెళ్ళైన నాలుగేళ్లకే విడిపోయి షాకిస్తే.. కోలీవుడ్ కపుల్ ధనుష్-ఐశ్యర్య ఏకంగా 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి బిగ్ షాకిచ్చారు. ఇలా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఈ మధ్య కాలంలో ఎన్నో జంటలు విడిపోయాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన మరో జంట ఏకంగా పాతికేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
'ఆమె'(1994) చిత్రంలో కలిసి నటించిన శ్రీకాంత్, ఊహ ఆ తర్వాత ప్రేమలో పడి 1997 లో పెళ్లి చేసుకున్నారు. హీరోగా 100కి పైగా సినిమాల్లో నటించిన శ్రీకాంత్ ఇప్పటికీ విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. ఇక సౌత్ భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించిన ఊహ పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీకాంత్-ఊహ పెళ్ళయ్యి పాతికేళ్ళు అయింది. ఇన్నేళ్ల వారి వివాహ బంధంలో మనస్పర్థలు తలెత్తినట్టు వార్తలు రాలేదు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఏకంగా పాతికేళ్ళ తర్వాత విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు ఇప్పుడు వార్తలు రావడం సంచలనంగా మారింది.
ఇటీవల శ్రీకాంత్, ఊహ మధ్య విభేదాలు తలెత్తాయని.. చిలికి చిలికి గాలివాన అయినట్లుగా అది ఏకంగా విడాకుల వరకు వెళ్లిందని కొన్ని వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానల్స్‌లో కథనాలు వచ్చాయి. వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలిసి.. ఇరు కుటుంబసభ్యులు రంగంలోకి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు అవి ప్రసారం చేశాయి. అయితే ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.