'లైగర్' దెబ్బకి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ చేయాల్సిన 'జన గణ మన' అటకెక్కింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' చిత్రం చేస్తున్న విజయ్.. నెక్స్ట్ సినిమా ఎవరి డైరెక్షన్ లో చేయనున్నాడనే దానిపై క్లారిటీ రాలేదు. ఇటీవల డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు తాజాగా శేఖర్ కమ్ముల పేరు తెరపైకి వచ్చింది.
'లవ్ స్టోరీ'(2021) తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా రాలేదు. తమిళ్ హీరో ధనుష్ తో చిత్రాన్ని ప్రకటించాడు గానీ ఇంతవరకు పట్టాలెక్కలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్-కమ్ముల మధ్య కథా చర్చలు జరుగుతున్నట్టు న్యూస్ వినిపిస్తోంది. నిజానికి విజయ్ హీరోగా పరిచయం కాకముందు కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలతో హీరోగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్. అయితే కొంతకాలంగా వరుస పరాజయాలను చూస్తున్నాడు. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విజయ్ సినిమా చేసే అవకాశముందనే న్యూస్ ఆసక్తికరంగా మారింది. డైరెక్టర్ గా పలు క్లాసిక్ హిట్స్ ని అందుకున్న కమ్ముల.. విజయ్ తో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.