ఇటీవల 'జిన్నా' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మంచు విష్ణు తన తదుపరి సినిమాని ప్రభుదేవా దర్శకత్వంలో చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా 15 ఏళ్ళ తర్వాత తెలుగు సినిమాని డైరెక్ట్ చేయడానికి ప్రభుదేవా సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దర్శకుడిగా ప్రభుదేవా ప్రయాణం తెలుగులోనే ప్రారంభమైంది. తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'(2005), 'పౌర్ణమి'(2006), 'శంకర్ దాదా జిందాబాద్'(2007) సినిమాలను డైరెక్ట్ చేసిన ఆయన.. ఆ తర్వాత తమిళ్, హిందీ భాషల్లోనే సినిమాలు చేశాడు. మళ్ళీ ఇన్నాళ్లకు తెలుగులో ఓ సినిమా డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. నిజానికి మెగాస్టార్ చిరంజీవితో ప్రభుదేవా సినిమా చేయబోతున్నట్టు ఇటీవల ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు విష్ణు పేరు తెరపైకి వచ్చింది.
'జిన్నా'లో ఓ సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశాడు. ఆ సమయంలోనే విష్ణు, ప్రభుదేవా మధ్య సినిమా చేయాలనే చర్చ వచ్చినట్లు తెలుస్తోంది. రీమేక్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా.. విష్ణుతో ఏదైనా రీమేక్ తీసే అవకాశాలున్నాయి అంటున్నారు. పైగా ఇటీవల విష్ణు వివిధ భాషలకు చెందిన పలు సినిమాల రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. మరి వాటిలో ఏదైనా రీమేక్ విష్ణు, ప్రభుదేవా కాంబినేషన్ లో తెరకెక్కుతుందేమో చూడాలి.