పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ రాకముందే భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ నిలిచారు. 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', 'అపరిచితుడు', 'రోబో' వంటి సినిమాలతో సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'RC 15', 'ఇండియన్-2'(భారతీయుడు-2) వంటి భారీ సినిమాలు రూపొందుతున్నాయి. ఇదిలా ఉంటే ఆయన 'బాహుబలి' తరహాలో ఓ భారీ ప్రాజెక్ట్ కి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో శంకర్ ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలి అనుకుంటున్నారు. అది 'అపరిచితుడు' రీమేక్ లేదా 'అపరిచితుడు' సీక్వెల్ అయ్యుండొచ్చు అనే న్యూస్ కూడా వినిపించాయి. అయితే తాజాగా మరో న్యూస్ బలంగా వినిపిస్తోంది. ప్రముఖ తమిళ నవల 'వేల్పరి' ఆధారంగా రణ్ వీర్ సింగ్ హీరోగా శంకర్ సినిమా తెరకెక్కించనున్నారని, భారీ బడ్జెట్ తో మూడు భాగాలుగా ఇది రూపొందనుందని తెలుస్తోంది.
ఇటీవల మరో తమిళ నవల 'పొన్నియన్ సెల్వన్' ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన 'పొన్నియన్ సెల్వన్-1' ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ముఖ్యంగా తమిళనాడులో వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక ఈ మూవీ రెండో భాగం కూడా వచ్చే ఏడాది రానుంది. అయితే ఈ సినిమా 'బాహుబలి' స్థాయిలో సత్తా చాటలేకపోయింది. రెండో భాగం కూడా ప్రపంచస్థాయిలో బాహుబలి రికార్డులని బ్రేక్ చేసే అవకాశం లేదు. ఈ క్రమంలోనే శంకర్ బాహుబలికి ధీటైన సినిమా చేయాలని అనుకుంటున్నారట. 'RC 15', 'ఇండియన్-2' చిత్రాల తర్వాత శంకర్ పూర్తి దృష్టి రణ్ వీర్ సింగ్ ప్రాజెక్ట్ మీదే పెట్టనున్నారని అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ తో శంకర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.