పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే చిత్రం చేయడం కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాడు. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రమే ఆలస్యమవుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా తర్వాత ఆయన ఎన్నికలు పూర్తయ్యేవరకు రాజకీయాల మీదే పూర్తి దృష్టి పెట్టే అవకాశముంది. అదే జరిగితే 'భవదీయుడు భగత్ సింగ్' కోసం హరీష్ చాలాకాలం ఎదురుచూడక తప్పదు. అందుకే ఆయన ఈలోపు మరో ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించాలని చూస్తున్నాడట.
2019 లో వచ్చిన 'గద్దలకొండ గణేష్' తర్వాత హరీష్ దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా పట్టాలెక్కలేదు. ఇప్పటికే మూడేళ్లు దాటిపోవడంతో.. హరీష్ కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని పవన్ సైతం ఆయనని మరో హీరోతో సినిమా చేసుకోమని సూచించాడట. ఈ క్రమంలో ఇటీవల వరుణ్ తేజ్ తో సినిమా చేయడానికి హరీష్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు వార్తలొచ్చాయి. కానీ హరీష్ టార్గెట్ అంతా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మీదనే ఉందట.
హరీష్ కొన్ని నెలల క్రితం సల్మాన్ ని కలిశాడు. అప్పుడే సల్మాన్ తో హరీష్ మూవీ ఉండొచ్చని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేసే పనిలో హరీష్ ఉన్నాడట. ముంబైలో సల్మాన్, హరీష్ మధ్య కథా చర్చలు జరుగుతున్నాయట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కనుందని సమాచారం. నార్త్ లో సౌత్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తుండటంతో.. బాలీవుడ్ స్టార్లు సౌత్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఇప్పటికే తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో 'జవాన్' చేస్తున్నాడు. సల్మాన్ సైతం గతంలో ప్రభుదేవా వంటి దర్శకులతో పని చేశాడు. ఇప్పుడు అదే బాటలో హరీష్ కి కూడా అవకాశమిస్తాడేమో చూడాలి.