మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. వింటేజ్ మెగాస్టార్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ పాత్ర నిడివి దాదాపు 40 నిమిషాల ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మరో యంగ్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది.
'ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ ఓ వైపు హీరోగా, మరోవైపు విలన్ గా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. చిరంజీవికి వీరాభిమాని అయిన కార్తికేయకు ఇప్పుడేకంగా తన అభిమాన హీరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కార్తికేయ ఎస్ఐ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, సినిమాకి చాలా కీలకమైన పాత్ర అని సమాచారం. ఆ పాత్రకున్న ప్రాముఖ్యత దృష్ట్యా కార్తికేయను సంప్రదించగా.. మెగాస్టార్ సినిమా కావడంతో అసలు ఏమాత్రం ఆలోచించకుండా యంగ్ హీరో వెంటనే ఓకే చెప్పినట్టు చెబుతున్నారు.
గత చిత్రం 'గాడ్ ఫాదర్'లోనూ తనను ఎంతగానో అభిమానించే యంగ్ హీరో సత్యదేవ్ కి చిరంజీవి విలన్ గా అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర సత్యదేవ్ కి ఎంతగానో పేరు తీసుకొచ్చింది. మరి 'వాల్తేరు వీరయ్య'తో మరో యంగ్ హీరో కార్తికేయ కూడా అదే స్థాయిలో అలరిస్తాడేమో చూడాలి.