'వార్-2' మూవీతో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా 'వార్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ మూవీకి ఆదిత్య చోప్రా నిర్మాత. ఈ యాక్షన్ థ్రిల్లర్ 2025 ఆగస్టులో విడుదల కానుంది. అయితే 'వార్-2' షూటింగ్ దశలో ఉండగానే, మరో హిందీ సినిమాకి ఎన్టీఆర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఆదిత్య చోప్రా పట్టుబట్టి మరీ 'వార్-2'లో ఎన్టీఆర్ ని భాగం చేశాడని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేరుగా ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ ని చూసి మరింత ఇంప్రెస్ అయిన ఆదిత్య చోప్రా.. ఎన్టీఆర్ సోలో హీరోగా మరో భారీ సినిమా నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ మూవీకి కూడా అయాన్ ముఖర్జీనే దర్శకత్వం వహించనున్నాడట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి కథా చర్చలు కూడా జరిగినట్లు వినికిడి. అయాన్ చెప్పిన స్టోరీ లైన్ ఎన్టీఆర్ బాగా నచ్చిందట. 'వార్-2' పూర్తయ్యాక, ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది అంటున్నారు.