సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా, హీరోయిన్లుగా నటించిన ఎంతో మంది జంటలుగా మారారు. ఇది ఇప్పటిది కాదు, పాతతరం నుంచీ నడుస్తున్న కథే. అయితే పుకార్లు లేకుండా ఇప్పటివరకు ఏ జంటా పెళ్లి చేసుకోలేదనేది వాస్తవం. తమ కెరీర్‌ని దృష్టిలో పెట్టుకొని హీరో అయినా, హీరోయిన్ అయినా తమ అనుబంధం గురించి వస్తున్న పుకార్లను తోసిపుచ్చడం చూశాం. తర్వాత అదే జంట పెళ్లి చేసుకోవడం కూడా చూశాం. ఇటీవలికాలంలో కొందరు నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రాబోతున్నారనేది సోషల్ మీడియాల కన్‌ఫర్మ్ చేసేస్తోంది. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలుతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రూఫ్‌లను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీరిపై ఎన్ని రూమర్స్ వచ్చినా ఇద్దరూ స్పందించకపోవడం విశేషం.
ఏ సందర్భంలోనూ తాము ప్రేమించుకుంటున్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని వారిద్దరూ చెప్పలేదు. కానీ, వారి అభిమానులు మాత్రం ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసేసుకున్నారు. ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు రెండే అయినా చక్కని జోడీ అనే పేరు వచ్చింది. నిజజీవితంలోనూ వారిని జంటగా చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. తాజాగా జరిగిన కొన్ని పరిణామాలను గమనిస్తే.. అభిమానుల కోరిక తీరేలా కనిపిస్తోంది, త్వరలోనే ఇద్దరూ వైవాహిక బంధంలోకి వెళ్తారనేది నిజమనిపిస్తోంది. అంత కన్‌ఫర్మ్‌గా అందరూ చెప్పుకోవడానికి రీజన్ ఉంది. ఇటీవల ఒక రెస్టారెంట్‌లో విజయ్, రష్మిక కలిసి భోజనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు, తన కోస్టార్‌తో డేటింగ్ చేశానని విజయ్ చెప్పడంతో ఆ ఫోటోకి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. అలా విజయ్ కామెంట్ చేసిన తర్వాత మరి మీ జంట ప్రేమలో ఉందనే విషయాన్ని ఎప్పుడు కన్‌ఫర్మ్ చేస్తారంటూ అతనిపై, రష్మికపై ప్రశ్నల వర్షం కురిపించారు నెటిజన్లు.
ఇదిలా ఉంటే.. తాజాగా ‘పుష్ప2’ ఈవెంట్ చెన్నయ్‌లో జరిగింది. ఆ సమయంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు రష్మిక. ‘మీకు ఇష్టమైన వ్యక్తి ఇండస్ట్రీకి చెందిన వారా లేక బయటివారా’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘అది అందరికీ తెలిసిన విషయమే’ అంటూ సిగ్గుపడుతూ చెప్పారు రష్మిక. ఈ మాటతో ఆ ఈవెంట్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారంతా. ఈవెంట్‌లో ఉన్న అల్లు అర్జున్, శ్రీలీల కూడా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. అంతటితో ఆగని యాంకర్ ఈ విషయంలో మరో హింట్ ఇవ్వమని అడిగింది. ‘ఆ విషయాన్ని మీకు పర్సనల్‌గా చెబుతాను’ అంటూ దాటవేసింది రష్మిక. దీంతో తమ ప్రేమ గురించి విజయ్, రష్మిక ఓపెన్ అయిపోయారంటూ కామెంట్స్ పెడుతున్నారు. రష్మిక ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గురించే అలా చెప్పారని అంటున్నారు. రెస్టారెంట్‌లో ఉన్న వీరిద్దరి ఫోటో బయటికి వచ్చిన కొన్ని గంటల్లోనే రష్మిక అలా కామెంట్ చేయడంతో విజయ్‌తో డేటింగ్‌లో ఉన్నది రష్మికేనని అంతా కన్‌ఫర్మ్ చేసుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఈ జంట ఎనౌన్స్ చేస్తుందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. మరి దీనిపై విజయ్ దేవరకొండ, రష్మిక ఎలా స్పందిస్తారో, ఏం సమాధానం చెప్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ వీరిని మంచి జంటగా చూడాలని అంతా కోరుకుంటున్నారు. ఈ విషయంలో వీరిద్దరి స్పందన ఏమిటో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.