పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 'ఓజీ' సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వారి ఎక్సైట్ మెంట్ ని రెట్టింపు చేసే న్యూస్ వినిపిస్తోంది. (OG Movie)
'ఓజీ' సినిమాతో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ (Akira Nandan) వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమేనని, ఈ సినిమాలో అకీరా నటిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. రీసెంట్ గానే అకీరా కనిపించే సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందని టాక్.
'ఓజీ'లో పవన్ పాత్ర మూడు దశల్లో ఉంటుందట. టీనేజ్ కుర్రాడిగా, యువకుడిగా, గ్యాంగ్ స్టర్ గా ఇలా మూడు దశల్లో చూపిస్తారట. అయితే 15 నిమిషాల పాటు ఉండే టీనేజ్ కుర్రాడి పాత్రలో అకీరా నటిస్తే బాగుంటుందని సుజీత్ సూచించాడట. దీంతో పవన్, 'ఓజీ' కోసం అకీరాను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'ఓజీ'పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక పవన్ తనయుడు అకీరా కూడా ఈ సినిమాలో నటిస్తే ఇక ఆ అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఓజీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.