మెగా సెంటిమెంట్.. అప్పుడు రవితేజ, ఇప్పుడు వెంకటేష్!
on Mar 30, 2025
2023 సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన యాక్షన్ కామెడీ ఫిల్మ్.. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇదే మ్యాజిక్ ని 2026 సంక్రాంతికి రిపీట్ చేయడానికి మెగాస్టార్ సిద్ధమవుతున్నారు. (Chiranjeevi)
ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' చిత్రం చేస్తున్న చిరంజీవి, తన తదుపరి సినిమాని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కమిట్ అయిన సంగతి తెలిసిందే. గోల్డ్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది. ఈ ఈవెంట్ కి వెంకటేష్ హాజరై, ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టడం విశేషం. ఈ క్రమంలో ఒక సర్ ప్రైజింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారట. (Mega157 Launch)
అనిల్ రావిపూడికి, వెంకటేష్ కి మంచి అనుబంధముంది. వీరి కలయికలో ఇప్పటిదాకా మూడు సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో అనిల్ అడగ్గానే.. చిరంజీవి సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరవడానికి వెంకటేష్ ఒప్పుకున్నారట.
చిరు-అనిల్ మూవీని 2026 సంక్రాంతికి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అసలే రావిపూడికి సంక్రాంతి డైరెక్టర్ గా పేరు పడిపోయింది. దానికి తోడు, చిరంజీవికి కూడా పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. 2023 సంక్రాంతికి రవితేజతో కలిసి వచ్చి 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 2026 సంక్రాంతికి వెంకటేష్ తో కలిసి వచ్చి మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారేమో చూడాలి. ఇక ఈ సినిమాకి 'చిరు నవ్వుల పండగ' అనే పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
