టుక్ టుక్ మూవీ రివ్యూ
on Mar 21, 2025
తారాగణం: హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోధాటి తదితరులు
సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయి కుమార్
సంగీతం: సంతు ఓంకార్
ఎడిటర్: అశ్వత్ శివకుమార్
దర్శకత్వం: సుప్రీత్ కృష్ణ
నిర్మాత: రాహుల్ రెడ్డి, శ్రీ వరుణ్, శ్రీరాములు రెడ్డి
బ్యానర్: చిత్రవాహిని ప్రొడక్షన్స్, ఆర్.వై.జి. సినిమాస్
విడుదల తేదీ: మార్చి 21, 2025
హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'టుక్ టుక్'. సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ 'టుక్ టుక్' చిత్రం ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Tuk Tuk Movie Review)
కథ:
చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో యుక్త వయసులో ఉన్న ముగ్గురు కుర్రాళ్ళు (హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటారు. వీడియోలు షూట్ చేసి డబ్బులు సంపాదించాలనుకున్న ఆ కుర్రాళ్ళు.. అందు కోసం మంచి కెమెరా కొనాలి అనుకుంటారు. కానీ, కెమెరా కొనడానికి డబ్బులు లేకపోవడంతో.. చందాల ద్వారా డబ్బు వస్తుందనే ఆశతో వినాయకుడి విగ్రహం పెట్టి వేడుక చేస్తారు. అయితే వారు పెట్టిన వినాయక విగ్రహ నిమజ్జనానికి వాహనం దొరకదు. దాంతో మూలన పడి ఉన్న పాత చేతక్ స్కూటర్ ను రిపేర్ చేయిస్తారు. దానికి టుక్ టుక్ అని పేరు పెట్టి, వినాయకుడిని దానిపైనే ఊరేగించి నిమజ్జనం చేస్తారు. అయితే ఆ స్కూటర్ లో అదృశ్య శక్తి ఉంటుంది. ఆ స్కూటర్ వచ్చిన తర్వాత ముగ్గురు జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి. అసలు ఆ స్కూటర్ లో ఉన్నది ఏంటి? ఆ స్కూటర్ కి, శిల్ప(శాన్వీ మేఘన)కు సంబంధం ఏంటి? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
వాహనాల చుట్టూ అల్లుకున్న కథలతో గతంలో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. టుక్ టుక్ కూడా స్కూటర్ చుట్టూ అల్లుకున్న కథే అయినప్పటికీ.. అవును, కాదు అనే సైగలతో ఆ స్కూటర్ తో సమాధానాలు చెప్పించడం కాస్త కొత్తగా ఉంది. ముగ్గురు కుర్రాళ్ళ హంగామా, డబ్బు కోసం వారు పాత స్కూటర్ ను రిపేర్ చేయించడం, ఆ స్కూటర్ ద్వారా వారు డబ్బు సంపాదించే సన్నివేశాలతో సినిమా ప్రారంభమైన తీరు బాగుంది. స్కూటర్ లో ఆత్మ ఉందని తెలిశాక.. ఆ కుర్రాళ్ళ భయపడే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో అసలు ఆ ఆత్మ ఎవరిది? ఆ వాహనంలో ఎందుకు ఉంది? ఆత్మ అని తెలిశాక ఆ కుర్రాళ్ళు ఏం చేశారు? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ కథ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. పతాక సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' కథకి కాస్త దగ్గరగా ఉంటుంది. అలాగే కొన్ని సన్నివేశాలు లాజిక్ లెస్ గా, సాగతీతగా ఉంటాయి. అవి పక్కన పెడితే 'టుక్ టుక్' బాగానే మెప్పించింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఉండటం కొసమెరుపు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
హుషారైన కుర్రాళ్ళ పాత్రలలో హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు అంతే హుషారుగా నటించారు. శాన్వీ కూడా ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించి, సినిమాకి బలంగా నిలిచింది. మిగతా నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా కార్తీక్ సాయి కుమార్ కెమెరా వర్క్, సంతు ఓంకార్ సంగీతం హైలైట్ గా నిలిచాయి. ఎడిటింగ్ పరవాలేదు. సంభాషణలు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా..
హాస్యం, ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన 'టుక్ టుక్' ప్రయాణం దాదాపు సాఫీగానే సాగింది.
రేటింగ్: 2.5/5

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
