డబ్బు కోసం కక్కుర్తి పడకండి..!
on Mar 21, 2025
ఇటీవలికాలంలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై ఎడిజిపి వి.సి.సజ్జనార్ లేవనెత్తిన అంశం పెద్ద దుమారం రేపింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సినీ ప్రముఖులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే ఎంతోమంది బెట్టింగ్ ప్రమోటర్లపై కేసులు నమోదయ్యాయి. ఇందులో కొందరు సినీ ప్రముఖులు, కొందరు టీవీ షోల ద్వారా ప్రాచుర్యం పొందినవారు, మరికొందరు యూ ట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
న్యూ ఢల్లీిలోని ఆంధ్రా భవన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ ‘యువతను పెడదోవ పట్టించే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చెయ్యకండి. డబ్బు కోసం ఇలాంటి ప్రకటనలు చేయకండి. పవిత్రమైన కళామతల్లిని సమాజ అభివృద్ది కోసం వినియోగించాలి. సినీ పరిశ్రమ ద్వారా వచ్చిన ఖ్యాతిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదన వ్యామోహంతో అనైతిక చర్యలకు పాల్పడడం తీవ్రమైన పరిణామం. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం ద్వారా యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. గతంలో అల్లూరి రామలింగయ్య వంటివారు కళను సమాజ అభివృద్ధికి ఉపయోగించారనే విషయం గుర్తుంచుకోవాలి. తమకు తెలియకుండానే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశామని కొందరు చెబుతుంటే.. చట్టపరంగా అవకాశం ఉంది కాబట్టి చేశామని కొందరు చెప్పడం సరికాదు. ప్రజల్లో మీకు ఉన్న పాపులారిటీ వల్ల మీరు ప్రమోట్ చేసే వాటిని ఎంతో సులభంగా నమ్మి మోసపోతున్న విషయాన్ని మీరు గుర్తించాలి. బెట్టింగ్ యాప్‌ల వల్ల వేలాది మంది యువత బలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ఇంకా వాటిని ప్రమోట్ చేయడం చాలా పెద్ద నేరం. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బెట్టింగ్ యాప్‌లే కాదు, గుట్కా, పాన్ మసాలా, తప్పుడు పద్ధతుల్లో సాగే రియల్ ఎస్టేట్, మోసపూరిత బంగారు వ్యాపారాల ప్రకటనల్లో కూడా సినీ ప్రముఖులు నటించడం ద్వారా సమాజానికి ఎంతో కీడు చేస్తున్నారు. గతంలో కోకో కోలా కంపెనీ యాడ్ చేసిన తరుణంలో నేను చేసిన వ్యాఖ్యలకు సినీ హీరో చిరంజీవి స్పందించి ఇకపై అటువంటి యాడ్‌లు చేయనని ప్రకటించిన విషయం మీకు తెలుసు. చట్టాల్లో లొసుగులు ఉంటాయని అందరికీ తెలుసు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను చట్టంలోని లొసుగుల ఆధారంగానే అనేక కేసుల నుంచి తప్పించుకున్నానని చెప్పారు. మన దేశం విషయానికి వస్తే.. గుట్కా కూడా ఆహర పదార్థమే అని ఒక న్యాయమూర్తి తీర్పు ఇచ్చిన విషయం కూడా మనకు తెలుసు. ఏది ఏమైనా డబ్బు కన్నా నైతికత చాలా ముఖ్యం అని తెలుసుకోవాలి. ఇకనైనా సమాజానికి హాని చేసే అన్ని వ్యాపార ప్రకటనలకు సినిమా పరిశ్రమ దూరంగా ఉండాలి’ అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
