కొండా సురేఖపై పరువు నష్టం దావా.. పాపం నాగార్జునకు ఇలా జరిగిందేమిటి?
on Oct 4, 2024
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగా అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే జరుగుతోంది. రాజకీయ లబ్ది కోసం నాగార్జున కుటుంబాన్ని బజారుకీడ్చిన కొండా సురేఖపై ప్రతి ఒక్కరూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను ఖండిరచారు. యావత్ సినీ పరిశ్రమ నాగార్జున కుటుంబాన్ని సపోర్ట్ చేస్తోంది. అంతేకాదు, ప్రతి ఒక్కరూ మంత్రి చేసిన పనిని తప్పుబడుతూ ట్వీట్లు పెడుతున్నారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానని ఇటీవల మీడియా తెలియజేసింది. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది.
ఈ విషయాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకున్న నాగార్జున... ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. అయితే పరువు నష్టం కింద ఎలాంటి డబ్బు డిమాండ్ చెయ్యని నాగార్జున, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. శుక్రవారం ఈ కేసును విచారిస్తామని కోర్టు తెలియజేసింది. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విచారణను వాయిదా వేశారు. అక్టోబర్ 7న కేసును విచారిస్తామని న్యాయస్థానం తెలియజేసింది. నాగార్జున కుటుంబాన్ని అభాసుపాలు చేసేందుకు పూనుకున్న మంత్రి కొండా సురేఖపై అన్నివర్గాల ప్రజలు, ప్రముఖులు ఆగ్రహంతో ఉన్నారు. త్వరితగతిన ఈ కేసు విచారణ జరిగితే బాగుండేది అని భావిస్తున్నారు ప్రజలు. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో, కోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.