శివాజీ గణేశన్ ఇల్లు జప్తుకు ఆర్డర్.. కోర్టుకు షాక్ ఇచ్చిన ప్రభు!
on Mar 28, 2025
దాదాపు 50 సంవత్సరాలపాటు తమిళ సినీ రంగంలో నటుడుగా తనదంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేశారు శివాజీగణేశన్. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించిన ఆయన సౌత్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శివాజీకి ఇద్దరు కుమారులు రామ్‌కుమార్, ప్రభు. నటుడిగా, నిర్మాతగా రాణించి తండ్రి పేరును నిలబెట్టారు ప్రభు. ఈ కుటుంబానికి తమిళనాడులోనే కాదు, సౌత్‌లో ఎంతో మంచి పేరు ఉంది. 2001లో 72 ఏళ్ళ వయసులో కన్నుమూసారు శివాజీ గణేశన్. ఇప్పుడు ఆయన నివాసం ఉన్న ఇల్లు కోర్టు వివాదంలో ఇరుక్కుంది. అంత పెద్ద ఫ్యామిలీకి చెందిన ఆస్తి కోర్టు వరకు వెళ్ళడానికి గల కారణాలు ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..
శివాజీ పెద్ద కొడుకు రామ్‌కుమార్ కొడుకు దుష్యంత్, అతని భార్యతో కలిసి ధనభాగ్యం అనే ఫైనాన్స్ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. విష్ణు విశాల్ హీరోగా ఎజిల్ దర్శకత్వంలో రూపొందిన ‘జగజాల కిలాడీ’ చిత్ర నిర్మాణం కోసం దుష్యంత్ ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టారు. ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో దుష్యంత్ విఫలమయ్యాడు. దీంతో ధనభాగ్యం కంపెనీ కోర్టులో కేసు వేసింది. అంతటితో ఆగకుండా టి నగర్‌లో ఉన్న శివాజీ గణేశన్ ఇంటిని జప్తు చేసి వేలం వేయాలని ఆ కంపెనీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఆ కేసును విచారణకు తీసుకున్న కోర్టు దుష్యంత్‌కు నోటీసులు జారీ చేసింది. కానీ, అతను సమాధానం ఇవ్వలేదు. అయినప్పటికీ కోర్టు మరి కొంత సమయం ఇచ్చింది. అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ధనభాగ్యం కంపెనీ కోరినట్టుగా శివాజీ గణేశన్ ఇంటిని జప్తు చేయాలని ఆర్దర్ వేసింది.
కోర్టు వేసిన ఆర్డర్ చూసి ప్రభు షాక్ అయ్యారు. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రభు పిటిషన్ వేశారు. అందులో.. తన తండ్రి బ్రతికి ఉన్న సమయంలోనే ఆ ఇల్లును తన పేరు మీద రాశారని, అది తన సొంతం అని, రామ్‌కుమార్ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తన సొంత ఇంటిని జప్తు చేయడానికి ఆర్డర్ వేయడంతో తాను షాక్ అయ్యానని తెలిపారు. ఇల్లు తన పేరు మీదే ఉందని, అందులో సోదరుడు రామ్‌కుమార్‌కి ఎలాంటి హక్కు లేదని పిటిషన్‌లో స్పష్టం చేశారు. వెంటనే జప్తు ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవాలని ఆ పిటిషన్‌లో ప్రభు కోరారు. వచ్చే వారం ఈ కేసు విచారణకు రాబోతోంది. ప్రభు వేసిన పిటిషన్ కారణంగా తీర్పు అతనికే అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కోర్టు వేసిన జప్తు ఆర్డర్ చూసి షాక్ అయిన ప్రభు.. అది తన సొంతమని, అన్నయ్య కుటుంబానికి ఇందులో ఎలాంటి హక్కు లేదని పిటిషన్ వేసి షాక్ ఇచ్చారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
