రౌడీ హీరోకు పాన్ ఇండియా పిచ్చి!
on Mar 16, 2020
అతి తక్కువ కాలంలో స్టార్‌డమ్ వచ్చిపడటంతో విజయ్ దేవరకొండ ఇప్పుడు కేవలం టాలీవుడ్ స్టార్ అని కాకుండా పాన్-ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటంతో ఊగిపోతున్నాడు. ఇదివరకు 'డియర్ కామ్రేడ్' మూవీని పాన్ ఇండియా రేంజిలో విడుదల చేసి, క్రేజ్ తెచ్చుకోవాలని విజయ్ చాలా కష్టపడ్డాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర రాజధానులు తిరిగాడు. మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించాడు. ముంబై వెళ్లాడు. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఆ సినిమాకు పడ్డ కష్టం అతను అదివరకు ఏ సినిమాకూ పడలేదు. కానీ ఫలితం అనుకూలంగా రాలేదు. ఆ సినిమా బాక్సాఫీస్‌ను గెలవలేకపోయింది.
ఆ సినిమా విడుదల కంటే ముందే 'హీరో' అనే సినిమాను పాన్ ఇండియా సినిమాగా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌తో ప్లాన్ చేయించాడు విజయ్. కానీ ఆ సినిమా ఆగిపోయింది. అదే పేరుతో తమిళంలో శివ కార్తికేయన్ ఒక సినిమా చేయడంతో హీరో ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇప్పుడు విజయ్ కోరికను నెరవేర్చే పనిని పూరి జగన్నాథ్ తీసుకున్నాడు. విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే (చంకీ పాండే కూతురు) జంటగా 'లైగర్' అనే మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తయారవుతున్న ఈ సినిమాని తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలనే ఉద్దేశంతో ఆయా భాషల్లో ఇప్పటికే 'లైగర్' టైటిల్‌ను పూరి రిజిస్టర్ చేయించాడు.
ఇదే తరహాలో తన తదుపరి సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజిలోనే చెయ్యాలని నిర్మాతలను విజయ్ అడుగుతున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తర్వాత తెలుగు చిత్రసీమలో తానే పాన్ ఇండియా స్టార్ కావాలనే ఆలోచన అతనిలో చాలా బలంగా ఉందని అతని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అనుకోవడంలో తప్పులేదు కానీ, అత్యాశకు పోకుండా నిర్మాణాత్మకంగా ప్లాన్ చేసుకుంటే విజయ్ తన లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు ఉన్నాయనేది విశ్లేషకుల మాట.