చరణ్‌ని రౌండప్ చేస్తున్నారు
on Nov 2, 2015
బ్రూస్లీ నష్టాలు అటు తిరిగి, ఇటు తిరిగి రామ్‌చరణ్ మెడకు చుట్టుకొంటున్నాయి. ఈ సినిమా వల్ల దారుణంగా నష్టపోయామని, రామ్‌చరణ్ స్పందించాలని లేదంటే.. మాకు ఆత్మహత్యలే శరణ్యమని ఒకరిద్దరు బయర్లు.. చరణ్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ ఒత్తిడి తట్టుకోలేక.. చరణ్ ఫిల్మ్‌ఛాంబర్‌లో బయ్యర్లతో ఓ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాడట. ఏదోలా మీకు న్యాయం జరిగేట్టు చూస్తా.. అంటూ అభయహస్తం అందించాడట.
నిజానికి ఈ సినిమా ఆర్థిక లావాదేవీలకూ, చరణ్ కీ ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే ఇది చరణ్ సొంత సినిమా కాదు. కాకపోయినా.. చరణ్ బ్రూస్లీ ఫ్లాప్‌ని నెత్తిమీద వేసుకోవాల్సివచ్చింది. చిరు ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారన్న న్యూస్ బయటకు రాగానే.. ఈ సినిమాపై అనూహ్యమైన అంచానాలు ఏర్పడ్డాయి. అన్ని ఏరియాల నుంచీ డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్‌ని దానయ్య బాగానే క్యాష్ చేసుకొన్నట్టు తెలుస్తోంది. చరణ్ సినిమాల స్థాయిని మించి.. ఈ సినిమాని అమ్మేశారు. అయితే రిజల్ట్ పల్టీ కొట్టడంతో... ఈ సినిమాకు రెండో రోజు నుంచే వసూళ్లు లేకుండా పోయాయి.
ఒక దశలో చరణ్ స్వయంగా స్పందించి `నేను ఎంతో కొంత పారితోషికం తిరిగిస్తా` అనేంత వరకూ వెళ్లింది. అయితే.. దసరా సీజన్ కావడంతో వసూళ్లు బాగుంటాయని, బయ్యర్లు తేరుకొంటారని చరణ్ భావించాడు. అయితే.. ఆ ఆశలూ ఆవిరైపోవడంతో బ్రూస్లీ బయ్యర్లు నీరసపడిపోయారు. నాలుగైదు రోజుల నుంచీ చరణ్ అపాయింట్ మెంట్ కోసం పడిగాపులు కాచారు. చివరికి చరణ్ కరుణించినట్టు.... `తరవాతి సినిమా మీకే వచ్చేట్టు చేస్తా` అని హామీ ఇవ్వడంతో బయ్యర్లు శాంతించినట్టు టాక్.