‘స్పిరిట్’ లేటెస్ట్ అప్‌డేట్ అదిరిందిగా.. ఇక ఫ్యాన్స్‌కి పండగే!
on Oct 4, 2025
ప్రస్తుతం ఇండియన్ సినిమా రూపం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు అంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా వచ్చేవి. అలాంటి సినిమాల్లో అప్పటి టాప్ హీరోలు ముగ్గురు నలుగురు నటించేవారు. అలా ప్రపంచ మార్కెట్‌ను హిందీ సినిమా టార్గెట్ చేసేది. బాలీవుడ్‌తో పోలిస్తే మల్టీస్టారర్ సినిమాలు సౌత్‌లో తక్కువగా ఉండేవి. ప్రస్తుత పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఒక భాషలో సినిమా నిర్మిస్తున్నారంటే అందులో వివిధ భాషలకు చెందిన నటీనటుల్ని కూడా తీసుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి ఇండియన్ మూవీస్. ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమాలు మొదలయ్యాయో అన్ని భాషలకు చెందిన నటీనటుల్ని ఒక దగ్గరికి చేరుస్తున్నారు. ఆ విధంగా ఒక భాషకు చెందిన హీరోను మరో భాషలో విలన్‌గా చూపిస్తున్నారు. అది వర్కవుట్ అవుతోంది కూడా. ఇప్పుడు చాలా మంది దర్శకులు దాన్నే ఫాలో అవుతున్నారు. జైలర్, సలార్, కల్కి, వార్2, కూలీ.. సినిమాలు అలా వచ్చినవే. తాజాగా పవన్‌కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజి సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్‌గా మెప్పించిన విషయం తెలిసిందే.
ప్రస్తుత మార్కెట్‌ను బట్టి, ప్రేక్షకుల టేస్ట్‌ను బట్టి హీరోలు కూడా విలన్స్‌గా నటించేందుకు ఎలాంటి ఇబ్బందీ పడడం లేదు. ఐదారేళ్లుగా ఈ తరహా సినిమాలు దాదాపు అన్ని భాషల్లోనూ వచ్చాయి. ఇక రాబోయే సినిమాల్లో ఎక్కువ మంది స్టార్స్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణగా చెప్పాలంటే.. ప్రభాస్, సందీప్‌రెడ్డి వంగా సినిమా కోసం స్టార్స్‌ని దింపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అలాగే ఫౌజీ చిత్రం షూటింగ్ కూడా జరుగుతోంది. స్పిరిట్ చిత్రాన్ని కూడా త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారు. ఈ క్రమంలోనే స్పిరిట్‌కి సంబంధించిన కొన్ని విశేషాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అర్జున్‌రెడ్డి, యానిమల్ చిత్రాలతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్‌రెడ్డి.. ప్రభాస్‌తో చేసే స్పిరిట్ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. నవంబర్ 5న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో స్పిరిట్‌కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఈ సినిమాలో కనిపిస్తాడని మొదటి నుంచీ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇందులో నటించే ఇతర నటీనటులకు సంబంధించిన కొత్త అప్‌డేట్ వచ్చింది. అదేమిటంటే.. ప్రభాస్‌కి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. మడోన్నా సెబాస్టియన్ ఒక కీలక పాత్ర పోషిస్తారు. ఇక విలన్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో స్టార్ హీరో అనిపించుకున్న వివేక్ ఓబెరాయ్ స్పిరిట్ సినిమాలో విలన్‌గా నటిస్తాడని తెలుస్తోంది.
బాలీవుడ్‌లో హీరోగా చాలా సినిమాల్లో నటించిన వివేక్.. క్రిష్3లో విలన్‌గానూ మెప్పించాడు. అలాగే వివేకం, వినయ విధేయ రామ చిత్రాల్లోనూ విలన్‌గా నటించి సౌత్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకున్నాడు. ఇక రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన రక్తచరిత్ర సిరీస్‌లోనూ తనదైన నటనను ప్రదర్శించాడు. ఇప్పుడు చాలా కాలం తర్వాత తెలుగులో నటించబోతున్నాడు. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్, బాబీ డియోల్‌తో సందీప్‌రెడ్డి చేయించిన విధ్వంసం గురించి తెలిసిందే. మరి స్పిరిట్‌లో ప్రభాస్‌ని, వివేక్ ఓబెరాయ్‌లతో సందీప్ ఎలాంటి బీభత్సం సృష్టిస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



