హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు
on Jul 20, 2017
బాలకృష్ణ-బోయపాటి శ్రీను... ఈ కాంబినేషన్ పేరెత్తితే... నందమూరి అభిమానుల హృదయాల్లో ఆనందం ఉప్పొంగుతుంది. బాలయ్యకు బోయపాటి ఇచ్చిన హిట్లు అలాంటివి మరి. వరుస పరాజయాలతో ఉన్న బాలయ్యకు... ‘సింహా’ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి బోయపాటి స్టార్ డైరెక్టర్ అయ్యాడు.
బాలకృష్ణతో వరుసగా హిట్లు కొట్టిన దర్శకులు అరుదు. ఎంతో మంది దర్శకులతో పనిచేసిన నందమూరి నట సింహానికి... కోడి రామకృష్ణ, బి.గోపాల్, ఎ.కోదండరామిరెడ్డి మాత్రమే వరుస హిట్లు ఇచ్చారు. ఈ జనరేషన్లో.. బాలయ్యతో వరుసగా రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు ఒక్క బోయపాటి శ్రీను మాత్రమే. సింహా, లెజెండ్ చిత్రాలతో బాలయ్య స్టామినాను మళ్లీ బాక్సాఫీస్ కి రుచి చూపించాడు బోయపాటి. అందుకే... బోయపాటి శ్రీను అంటే నందమూరి అభిమానులకు అంత ఇష్టం. ‘లెజెండ్’ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. బాలయ్య వందవ చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే ఉంటుందని అప్పట్లో వార్తలొచ్చినా... క్రిష్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూపంలో అదిరిపోయే హిట్ కొట్టేశాడు.
మరి బోయపాటి-బాలయ్య సినిమా ఎప్పుడు? ప్రస్తుతం ఇదే బాలయ్య అభిమానుల్లో టాపిక్. వారి ఎదురు చూపులకు పుల్స్ స్టాప్ పెడుతూ... త్వరలో ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా పట్టాలకెక్కనుంది. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘మైతీ మూవీమేకర్స్’ సంస్థ... రామ్ చరణ్ తో ‘రంగస్థలం’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాన్, నాగచైతన్యలతో సినిమాలు నిర్మించడానికి ఈ సంస్థ సమాయత్తం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీరే... బాలయ్య, బోయపాటి కాంబినేషన్ సినిమా చేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
బాలయ్య ‘పైసా వసూల్’ తర్వాత... కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో బిజీ అవుతారు. అది కూడా పూర్తయ్యాక.. బోయపాటి సినిమా ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం బోయపాటి ...‘జయ జానకీ నాయక’ సినిమా విడుదల హడావిడిలో ఉన్నాడు. సింహా, లెజెండ్ చిత్రాల్లో బాలకృష్ణను ఓ అగ్నిపర్వతంలా చూపించిన బోయపాటి... తాను చేయబోతున్న చిత్రంలో బాలయ్యను ఏ విధంగా చూపిస్తాడు చూడాలి.